తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు సీమాంధ్రులు. దీంతో పార్టీలన్నీ ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు తమతమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు బలంగా మారిందని… ఈ సమయంలో సీమాంధ్రులు కూడా సహకరిస్తే అధికారం తమదేనంటోంది కాంగ్రెస్ పార్టీ. అటు గత ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లపై పెద్దగా దృష్టిపెట్టని బీజేపీ.. ఇప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకుంది.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టాయి. క్యాస్ట్ ఈక్వేషన్లు ఎంత కీలకమో… ఇప్పుడు తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే పార్టీలన్నీ ఇప్పుడు సీమాంధ్రుల ఓట్లపై దృష్టి సారించాయి. ఈ వర్గానికి చేరువయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. 2014లో సీమాంధ్రులు అత్యధికంగా నివాసం ఉండే నియోజకవర్గాల్లో బీజేపీ- టీడీపీకి అనుకూలంగా ఫలితాలొచ్చాయి. అయితే తర్వాత మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు అండగా ఉంటూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. GHMC ఎన్నికల్లోనూ వారి మద్దతు అధికారపార్టీకే దక్కింది. ఇప్పుడు కూడా తమతోనే ఉన్నారని బలంగా నమ్ముతోంది బీఆర్ఎస్. సీమ ఓటర్లు, ఆంధ్రాఓటర్లు అంటూ ఎవరూ లేరని.. అంతా మా వాళ్లే అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మరోవైపు 2014లో మద్దతుగా నిలిచిన సీమాంధ్రులు ఆ తర్వాత దూరం కావడంపై బీజేపీ దృష్టి సారించింది. నిన్నమొన్నటిదాకా తెలంగానలో పొత్తులు ఉండవని సింగిల్‌గానే పోటీచేస్తామని ప్రకటించిన బీజేపీ అనూహ్యంగా జనసేనతో చర్చలు జరుపుతోంది. ఇటీవల ఢిల్లీలో అమిత్‌షా- లోకేష్ మధ్య జరిగిన సమావేశంలోనూ తెలంగాణ పార్టీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి కూడా ఉండటంతో సీమాంధ్ర ఓటర్లే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుందన్న చర్చ మొదలైంది.
మరోవైపు సీమాంధ్ర ఓటర్లకు గాలం వేసేందుకు కాంగ్రెస్ ద్విముఖ వ్యూహంలో వెళుతోంది. అటు చంద్రబాబు, ఇటు వైఎస్ రాజశేఖరరెడ్డి జపం చేస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులకు చేర్చుకోవడంతో పాటు.. రేణుకాచౌదరి ఆధ్వర్యంలో కులపెద్దలను ఢిల్లీ తీసుకెళ్లి మరీ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపేలా చేశారు. కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్‌తోనే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అటు రెడ్డి సామాజికవర్గానికి ముఖ్యంగా వైఎస్ అభిమానులుగా ఉన్న సీమాంధ్రలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల ఓట్ల వేటలో పార్టీలు తలమునకలయ్యాయి. మరి సీమాంధ్ర ఓటర్ల మనసులో ఏముందో మరి..!