National News Networks

ధరణి పాట్లు ఇంతింతకాదయా… 

Post top

నల్గొండ, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో ధరణి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా.. రైతుల భూ సంబంధిత సమస్యలు మాత్రం తీరడం లేదు. లక్షలాది ఎకరాల పట్టా భూములు ఇంకా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులోనే ఉన్నాయి. దాదాపు 5 లక్షల అర్జీలకు ప్రభుత్వం పరిష్కారం చూపకుండా పెండింగ్లో పెట్టింది. ధరణిలో అవసరమైన మాడ్యుల్స్ లేక కలెక్టర్లు, తహసీల్దార్లు కూడా చేతులెత్తేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసి కొద్ది రోజులు హడావుడి చేసిన సర్కారు పెద్దలు మళ్లీ ఆ జోలికెళ్లడం లేదు. పట్టాదారు పాస్ బుక్ లో వచ్చిన సర్వే నంబర్లు ధరణి పోర్టల్ లో కనిపించడం లేదంటూ.. రాష్ట్రంలో 35 వేల మంది సర్కారుకు అర్జీలు పెట్టుకుంటే వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లాల్సిన రైతులు కలెక్టర్, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పోడు భూముల పట్టాల కోసం గిరిజనులు పెట్టుకున్న 2.50 లక్షల దరఖాస్తులనూ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఆ భూములకు పట్టాలు ఇచ్చేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ఇంకా ప్రకటించకపోవడంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూవివాదాలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టలే మరిన్ని సమస్యలకు కారణమైన విషయం తెలిసిందే.

తొలుత అంతా బాగుందన్న ప్రభుత్వం.. ఆలస్యంగా మేల్కొని దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు మాడ్యుల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి సర్వే నంబర్ల తొలగింపు, మిస్సింగ్ సర్వే నంబర్ల యాడింగ్, పట్టాదారు పాస్ బుక్ జారీ కాకపోవడం, పాస్ పుస్తకాల్లో తప్పులు, పెండింగ్ మ్యుటేషన్ కు సంబంధించి వివిధ రకాల సమస్యలపై సుమారు 5 లక్షల దరఖాస్తులు ధరణి పోర్టల్ ద్వారా వచ్చాయి. ఇందులో కేవలం గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యుల్ ద్వారానే 2.42 లక్షల అర్జీలు వచ్చాయి. 2021 డిసెంబర్ వరకు 2,26,625 అప్లికేషన్లు రాగా, కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు 16,022 దరఖాస్తులు వచ్చాయి. ల్యాండ్ మ్యాటర్స్ అప్లికేషన్ల స్టేటస్ ను ధరణిలో చెక్ చేస్తే గ్రీవెన్స్ అడ్రస్డ్ బై కలెక్టర్, గ్రీవెన్స్ రిజిక్టెడ్ అనే రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి. గ్రీవెన్స్ అడ్రస్డ్ బై కలెక్టర్ అని సమాధానం వచ్చిన అప్లికేషన్లు ఎటుపోయాయో, పరిష్కారం ఏం చూపారో దరఖాస్తుదారులకు అర్థంకాని దుస్థితి నెలకొంది. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణాలను కూడా చెప్పడం లేదు. డ్యాష్ బోర్డుపై పెండింగ్ అప్లికేషన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు కొందరు కలెక్టర్లు అప్లికేషన్లను పూర్తిగా చూడకుండానే  రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పట్టా భూములు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నాయి. ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల  కోసం ఒక సర్వే నంబర్లో కొంత భూమిని సేకరిస్తే.. మొత్తం సర్వే నంబర్ నే ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చింది. అలాగే పట్టా భూములను కూడా ప్రభుత్వ భూములుగా, రెవెన్యూ ల్యాండ్స్ ను ఫారెస్ట్ , ఎండోమెంట్, వక్ఫ్ ల్యాండ్స్ గా మార్చడంతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల కు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల నుంచి రూ.1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో సగానికిపైగా అప్లికేషన్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫ్రీడం ఫైటర్లు, మాజీ సైనికులు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే పట్టాదారు పాస్ బుక్ లో వచ్చిన సర్వే నంబర్లు ఇప్పుడు ధరణి పోర్టల్ లో కనిపించడం లేదు. ఇలాంటి
మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ సర్వే నంబర్లకు సంబంధించి 35 వేల వరకు ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు ధరణిలో పరిష్కారం లేకపోవడంతో కలెక్టర్లు, తహసీల్దార్లు చేతులెత్తుస్తున్నారు. పోడు భూములకు హక్కుల కోసం గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని పోయిన ఏడాది నవంబర్ లో రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లక్షల అప్లికేషన్లు వచ్చాయి.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆసిఫాబాద్‌‌, ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌, సంగారెడ్డి జిల్లాల్లో పోడు భూములకు హక్కులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు రెండున్నర లక్షల మంది, 6.50 లక్షల ఎకరాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3,28,894 ఎకరాల కోసం 80,938 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,96,808 ఎకరాల కోసం 62,189 మంది పోడు రైతులు అప్లై చేశారు. అయితే ఈ భూములకు పట్టాలు ఇచ్చేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ను ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.