రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఆదివారం తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి కాలు కదిపారు. రాహుల్ తో కలిసి గిరిజన నృత్యం చేశారు. గిరిజన నృత్య కళాకారులు ప్రదర్శన ఇస్తున్నప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ లో మరో కీలక నాయకుడు కమల్ నాథ్ కూడా వేదికపైకి వచ్చారు.
రాహుల్ గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది. ఇరువురు నేతల మద్దతుదారులు పోటాపోటీగా పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత యుద్ధం నడిచింది. అశోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే సచిన్ పైలట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మరో క్యాంప్ నడిపించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి నుంచి గెహ్లాట్, పైలట్ ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు.
రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపైకి రావడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరోవైపు ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను మహాత్మా గాంధీ పార్టీగా అభివర్ణించారు. ‘ఇది మహాత్మా గాంధీ పార్టీ, సావర్కర్, గాడ్సేల పార్టీ కాదు. కష్టపడి పనిచేయడం మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తాను బీజేపీని గానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను గానీ ద్వేషించనని, అయితే దేశాన్ని భయంతో బతకనివ్వబోనని చెప్పారు.