National News Networks

ప్రకాశం జిల్లాలో కొత్తరకం దందా

Post top

ఒంగోలు, ఫిబ్రవరి 17: ప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్‌ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ ఎక్కడికి బయలుదేరుతుందనే సమాచారం తెలుసుకోవడం.. దారిలో కాపు కాసేయడం డబ్బులు కొట్టేయడమే ఈ దందా. అయితే రూపాయి పెట్టుబడి లేకుండా రోజూ వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు బయలుదేరాయి. మాదంటే మాది అంటూ గొడవలు జరుగుతున్నాయి.మార్టూరు కేంద్రంగా గ్రానైట్‌ని అక్రమంగా తరించేందుకు అధికారపార్టీలో లోకల్‌ లీడర్ల మధ్య పోటీ పెరగడంతో బండారం బయటపడుతోంది. ఒకరికి చెందిన లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో గొడవలు జరిగి పంచాయితీలు పార్టీ పెద్దల వద్దకి చేరుతున్నాయట. మార్టూరు మండలం రాజుపాలెంలో బిల్లులు లేకుండా వెళ్తోన్న ఓ వర్గానికి చెందిన లారీని మరోవర్గం నిలిపి వేయండంలో.. వ్యవహారం పరస్పరం దాడుల వరకు వెళ్లిందట.

గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు వర్గాల్లో ఒకరు మంత్రి బాలినేని పేరును వాడుతుండగా మరొకరు తాము పర్చూరు వైసీపీ ఇంఛార్జ్‌ రావి రామనాథంబాబు వర్గీయులుగా చెప్పుకొంటున్నారట. అయితే వారికి నిజంగా నేతలు మద్దతుగా ఉన్నారా అంటే లేదట. వీరంతా ఆ నేతల వద్ద తమకున్న పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి అక్రమ దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కోనంకికి చెందిన ఓ నాయకుడు మంత్రి బాలినేని పేరు చెప్పి అక్రమ వ్యాపారం ప్రారంభించారట. అది తెలిసి కస్సుమన్న యద్దనపూడి, మార్టూరు మండలాలకు చెందిన రామనాథంబాబు వర్గంగా చెప్పుకొంటోన్న వైసీపీ నేతలు సర్పంచ్‌ భర్తపై దాడి చేశారు. తమకు అందాల్సినవి అందడంతో పోలీసులు ఈ ఘటనలో జోక్యం చేసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.బల్లికురవ మండలంలో స్టీల్‌ గ్రే గ్రానైట్‌ తవ్వకాలు గతకొన్నేళ్లుగా జరుగుతున్నాయి. స్టీల్ గ్రే గ్రానైట్‌కి మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది.

తవ్వకాల తర్వాత ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొట్టేందుకు బల్లికురువ, మార్టూరు కేంద్రంగా ఉన్న కటింగ్‌ ఫ్యాక్టరీలకు దొంగచాటుగా రాయిని తరలిస్తున్నారట. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి 90 వేల నుంచి లక్షా 30 వేల వరకు రాయల్టీ, జీఎస్టీ కట్టాలి. ప్రభుత్వానికి ట్యాక్స్‌ ఎగ్గొట్టి గతంలో గ్రానైట్‌ రాళ్లు తరలించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ వే బిల్లులు తయారు చేసింది. ఆ ఘటనలో నకిలీ వేబిల్లులు తయారు చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ వే బిల్లులతో దాదాపు 290 కోట్ల వ్యాపారం చేసి.. ప్రభుత్వానికి 85 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్టు పోలీసులు గుర్తించారట.ఆ కేసు తర్వాత రూటు మార్చిన అక్రమార్కులు గ్రానైట్‌ను తరలించేందుకు లోకల్‌గా ఒక్కో లారీకి ఏడు వేల నుంచి పదివేలు వసూలు చేస్తున్నారట. మైనింగ్‌, పోలీస్, విజిలెన్స్‌ అధికారులకు ఆ మొత్తం నుంచి సర్దుతున్నారట. లాభాలు భారీస్థాయిలో ఉండటంతో అధికారపార్టీ లీడర్లు రాత్రికి రాత్రి పదుల సంఖ్యలో లారీలను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారట.

వ్యాపారం లాభసాటిగా ఉండటంతో వారు వర్గాలుగా విడిపోవడం.. ఒకరి లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో వ్యవహారం రచ్చకెక్కుతోందట. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం మంత్రి బాలినేని పేరుతో పాటు రావి రామనాథంబాబు పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేక వెనక్కు వెళ్లాల్సి వస్తుందట.ఒకటిరెండు సందర్భాలలో లారీలను పట్టుకున్న పోలీసులు బాగానే ఆర్జిస్తున్నారట. అక్రమ వ్యాపారాన్ని పోలీసులు మంత్రి బాలినేనితోపాటు రామనాథంబాబు దృష్టికి తీసుకెళ్లారట. వారు ఎటొచ్చి వ్యవహారాన్ని నడుపుతోంది వైసీపీ నేతలే కావడంతో ఏం చెప్పాలో అర్థంకాక ఇరకాటంలో పడుతున్నారట. దీంతో గ్రానైట్‌ అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు కొత్త స్కెచ్‌లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మంత్రి బాలినేని కూడా అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చేశారట. మంత్రి చెప్పారని పోలీసులు యాక్షన్‌ మొదలుపెడతారా? తమకొచ్చే పావలా బేడాలను వదిలేసుకుంటారా? అన్నది చర్చ. కేసులు పెడితే అధికార పార్టీ నేతల నుంచి రియాక్షన్‌ ఎలా ఉంటుందో పోలీసులకు, అధికారులకు తెలియంది కాదు. అందుకే గ్రానైట్‌ అక్రమ రవాణా మూడు లారీలు.. ఆరు రాళ్లగా సాఫీగా సాగిపోతోంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.