National News Networks

ఆలీకి ఎంపీ సీటు..?

Post top

విజయవాడ, ఫిబ్రవరి 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో జరిగిన టాలీవుడ్‌ ప్రముఖుల భేటీతో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గతకొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్లపై నెలకొన్ని సందిగ్ధతకు గురువారంతో ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని భేటీ హాజరైన వారంతా తెలిపారు. ఇక సీఎంతో జరిగిన ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ భేటీకి నటుడు అలీ కూడా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో అలీ వైసీపీకి మద్ధతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డి, అలీకి ప్రభుత్వంలో స్థానం కల్పించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదిలా ఉంటే తాజాగా సీఎంతో జరిగిన భేటీతో ఇప్పుడు అలీ రాజ్యసభ సీటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఒక స్థానం మైనార్టీ అభ్యర్థికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం అలీవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్‌ అలీతో ప్రత్యేకంగా మాట్లాడి.. మరో వారం రోజుల్లో మనం మరోసారి కలుద్దామని ప్రత్యేకంగా చెప్పారని తెలుస్తోంది. దీంతో అలీ రాజ్యసభ వెళ్లనున్నాడన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. మరి అలీ నిజంగానే రాజ్యసభకు వెళ్లనున్నారా.? లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే అలీని రాజ్యసభకు పంపించాలని కొరుతూ అలీ మద్ధతు దారులు పెట్టిన కొన్ని పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మైనారిటీ ప్రజల గురించి ఆలోచిస్తూ వారి కోసం కష్టపడే అలీ రాజ్యసభకు వెళితే బాగుంటుందని.. త్వరలో ఖాళీకానున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని అలీకి కేటాయించి, చట్ట సభకు పంపించాలంటూ ముఖ్యమంత్రిని కోరుతూ అలీ మద్దతు దారుల పేరుతో కొన్ని పోస్టులు వైరల్‌ అవుతోన్న నేపథ్యంలో ఈ వార్త బయటకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.