ఘాటెక్కనున్న బిర్యానీ!
హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు హైదరాబాద్ బిర్యానీపై చూపించనున్నాయి. ధరలు పెంచడం లేదా నాణ్యత తగ్గించడం మినహా మరో మార్గం లేదని హోటల్ పరిశ్రమ వ్యాఖ్యానిస్తున్నది.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ తీవ్రవాదులు వశపర్చుకోవడం, ఇండియాకు ఎగుమతులు నిలిపివేయడంతో హోటల్ పరిశ్రమ కు సెగ తగిలింది. బిర్యానీ తయారీలో బాదం, కిస్మిస్, అత్తి, పిస్తాను విస్తృతంగా వినియోగిస్తారు. ప్రతిరోజు కొన్ని టన్నుల కొద్దీ డ్రై ఫ్రూట్స్ ను హోటల్ కుక్ లు బిర్యానీలో వాడుతుంటారు. పేరున్న హోటళ్లలో సగటున ప్రతి రకం డ్రై ఫ్రూట్స్ ను 50 కేజీల వరకు వినియోగిస్తారు. ఇవి ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతుంటాయి. దీంతో ఆ దేశానికి చెందిన వారు ఇక్కడే ఉంటూ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు నిల్వలు నిండుకోనప్పటికీ, మరికొద్ది రోజుల్లో కొరత ఏర్పడనున్నది. తాలిబన్లు ఆంక్షలు సడలిస్తే సరి లేదంటే, ధరలు పెరగడం మినహా మరో మార్గం లేదని వ్యాపారులు అంటున్నారు.
తాలిబన్లు రాకముందు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బాగా ఉండేవి. తాలిబన్లు రావడంతోనే ఇండియాకు ఎగుమతులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ధరలు పెంచడం లేదా నాణ్యతలో రాజీపడ్డం మినహా మరో మార్గం లేదని హోటల్ యజమానులు తెలిపారు.