బిడ్డలను విసిరేస్తున్న ఆఫ్ఘన్ మహిళలు
కాబూల్: తాము ఏమైనా పర్వాలేదు… తమ బిడ్డలు ప్రశాంతంగా పెరిగితే చాలని భావించిన ఆఫ్ఘన్ మహిళలు దేశ సరిహద్దు కంచె వద్ద విలపిస్తున్నారు. మా బిడ్డలను మీరే రక్షించాలంటూ మహిళలు తమ పిల్లలను కంచె పై నుంచి విసిరేస్తున్నారు. తాలిబన్ పాలనలో మాకు రక్షణ లేదు, మీరైనా రక్షించాలని వేడుకుంటున్న దృశ్యాలు కంటతడి పెడుతున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశంలో భయానక పరిస్థితులు నెలకొనడం, ఇస్లామిక్ సంప్రదాయం పేరిట అరాచకాలకు తాలిబన్లు తెగబడడంతో మహిళలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. 15 సంవత్సరాలు దాటిన బాలికలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు, సోదరులు నానా కష్టాలు పడుతున్నారు. 15 ఏళ్లు దాటిన బాలికలు ఉంటే బలవంతంగా తీసుకువెళ్లి తాలిబన్ తీవ్రవాదులతో పెళ్లిళ్లు చేయిస్తున్నారు. బాలికల కోసం మూకలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని తమ పిల్లలు బతకాలనే లక్ష్యంతో మహిళలు దేశ సరిహద్దులకు పారిపోతున్నారు. సరిహద్దు ఆవలకు తమ పిల్లలను విసిరేసి కాపాడాలని వేడుకుంటున్నారు. తాలిబన్ వశమైన దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదని, ముఖ్యంగా మహిళలంటే చిన్న చూపు ఉందని వాపోతున్నారు. సెక్స్ యంత్రాలుగానే పరిగణిస్తున్నారని, మనిషిగా గుర్తించడం లేదని మహిళలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. సరిహద్దుల్లో గేట్లు తీయండి లేదంటే తమ తలను తాలిబన్లు నరికేస్తాంటూ మహిళలు రోదిస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న వారిని నిలువరించేందుకు పెద్ద ఎత్తున ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. తమ పిల్లలను రక్షించాలంటూ బ్రిటిష్ సైన్యం వైపు పిల్లల్ని విసిరేస్తున్న వీడియోలు ప్రపంచ ప్రజలను నిశ్చేష్టులుగా మార్చాయి. బ్రిటిష్ సైన్యం వైపు విసిరేస్తున్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. సైనికులు కూడా ఏం చేయలేక పసి పిల్లలను ఎత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.