National News Networks

ఉగాది తర్వాత ఉధృతం.. కేంద్రంపై ‘వరి పోరు’కు కార్యాచరణ సిద్ధం చేసిన టీఆర్‌ఎస్‌

Post top
  • 3న మీడియా సమావేశంలో వెల్లడించనున్న కేసీఆర్‌
  • వినూత్న నిరసనలకు యోచన
  • ప్రతిఇంటిపై నల్లజెండాలు.. బీజేపీ నేతల ఇళ్ల ముట్టడులు

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూపిస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఆ మేరకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలను రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టడం కూడా ఉద్యమ కార్యాచరణలో అంతర్భాగంగా ఉండనుందని పేర్కొంటున్నాయి.

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారం రోజులుగా ఉద్యమ వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశంపై గత మూడు, నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు.

పది రోజుల అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో కూడా సీఎం ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరి పోరుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను కేసీఆర్‌ ఈ నెల 3న మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించనున్నారు.

శాంతియుత పద్ధతుల్లో నిరసనలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, ఏ ఒక్క వర్గానికి నష్టం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా నిరసన కార్యక్రమాలకు కేసీఆర్‌ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. బంద్‌లు, రాస్తారోకోలు వంటివి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటం, విద్యార్థులకు పరీక్షల సీజన్‌ ప్రారంభమవుతుండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలని సీఎం భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో సడక్‌ బంద్, వంటా వార్పు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లిన రీతిలోనే వరి పోరును కూడా శాంతియుత పద్ధతిలోనే చేపట్టాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి.

రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడితో పాటు ధాన్యం కొనుగోలుపై వైఖరి చెప్పాలంటూ అడుగడుగునా నిలదీసేలా నిరసన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14న గద్వాల నుంచి తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు. ఆ సమయానికే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకునేలా టీఆర్‌ఎస్‌ కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ వేదికగా సీఎం నేతృత్వంలో నిరసన
రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ నిరసనకు దిగుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. రైతు సంఘాలు, భావ సారూప్య రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలు, పలువురు నేతలను కూడా ఈ దీక్షకు ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారు.

‘తెలంగాణ ఉద్యమంలో అనేక వినూత్న నిరసన రూపాలను చూశాం. అలాగే ఉగాది తర్వాత మొదలయ్యే రైతు ఉద్యమంలోనూ సరికొత్త ఉద్యమ రూపాలను చూస్తారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తి చూపడంతో పాటు వరి కొనుగోలుకు కేంద్రం దిగివచ్చేలా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి..’అని టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.

 

Post bottom

Leave A Reply

Your email address will not be published.