తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీని వీడనున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఈ మేరకు స్వయంగా భిక్షమయ్య గౌడే సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తనకు టీఆర్ఎస్‌లో జరిగిన అవమానాలు, తత్ఫలితంగా తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి ఆయన ఏకరువు పెట్టారు.
“ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో టీఆర్ఎస్‌లో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా. ఇక్కడి ప్రజల నుంచి నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని, ప్రజలను కలవొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేనే ఛేదించాను. ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా” అని ఆయన పేర్కొన్నారు.