కేంద్రానిది దళిత వ్యతిరేక బడ్జెట్…
కేంద్ర ప్రభుత్వానిది దళిత, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని ఎంపి వెంకటేశ్ నేతకాని అన్నారు. దేశంలో 40 కోట్లు ఉన్న ఎస్సి, ఎస్టీలకు బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ నిధుల్ని ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిందన్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్ లో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కరోనా క్లిష్ట సమయంలో ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించలేని స్థితిలో బిజెపి ఉందని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనారిటీలు, రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కేంద్రం దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బిజెపికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, రాష్ట్రాల పై పెత్తనం చేయాలని చూస్తుందన్నారు. వ్యవసాయం, డాం సేఫ్టీ, ఎన్ఐఏ ను తన గుప్పెట్లోకి తీసుకుందన్నారు. రాజ్యాంగాన్ని బిజెపి రాజ్యాంగంగా మార్చుకుందని ఆరోపించారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వనందుకు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు నిరసనలు చేయాలని సూచించారు.