National News Networks

ఎస్మాకు సిద్థమౌతున్న సర్కార్

Post top

విజయవాడ, ఫిబ్రవరి 5: ఓవైపు చ‌ర్చ‌ల‌కు ఎప్పుడైనా సిద్ధం అంటూనే.. ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు అయినా వెనుకాడేది లేద‌నే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.. రాష్ట్రంలో ఎస్మా ప్రయోగించటానికి ఉన్న అవకాశాలపై ఏపీ స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తోంది.. ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే ఏం చేద్దాం.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందాం..? ప‌్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? త‌దిత‌ర అంశాల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.. మంత్రులు బుగ్గన, బొత్స, సలహాదారు సజ్జలతో ఈ స‌మావేశం రెండు గంట‌ల‌కు పైగా కొన‌సాగుతుండ‌గా.. క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బ‌య‌ల్దేరి వెళ్లిపోయారు సీఎస్ సమీర్ శర్మ.మ‌రోవైపు.. స‌మ్మె నేప‌థ్యంలో.. జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం కానున్నారు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయ‌నున్నారు.. అత్యవసర సేవల నిర్వహణా చట్టం 1971 ప్రకారం ఎస్మా ప్రయోగించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, ప్రజా రవాణా, విద్యుత్, నీళ్ల సప్లయ్, అంబులెన్స్ సర్వీసులు, మందుల తయారీ, రవాణా, ఆహార రంగం, బయో మెడికల్ వ్యార్ధాల నిర్వహణ వంటి సేవల అంశాల్లో ఎస్మా ప్రయోగించే అవ‌కాశం క‌నిపిస్తోంది.. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.. మరోవైపు సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఎ జీవోల్లో సవరణ అంశం పై సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేశారు.

75 డిమాండ్ల సాధ్యమా….
పీఆర్సీ ఉద్య‌మం ఉధృత‌మైంది.. స‌మ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్ప‌టికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుంద‌ని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావ‌డం లేద‌న్న ఆయ‌న‌.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంద‌న్నారు.. ఆ మేరకు చర్యలు తీసుకోక త‌ప్ప‌ద‌న్నారు.. అయితే, ఇప్పటికీ చర్చలకు ఓపెన్ ఆహ్వానం ఉంద‌న్న స‌జ్జ‌ల‌.. ప్రతి రోజు పిలవటం ఉండదు కదా? వాళ్లు మేం చర్చలకు వస్తాం అంటే వెళ్లటానికి మేం సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. వాళ్ల పై వాళ్లే ఒత్తిడి చేసుకోవటం స‌రికాద‌న్నారు. ఇక‌, బయటి రాజకీయ పార్టీలు వస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది… అప్పుడు ఉద్యోగులది ప్రేక్షకపాత్ర అవుతుంద‌న్నారు స‌జ్జ‌ల‌.. రాజకీయ, అసాంఘిక శక్తులు కూడా చలో విజయవాడలో పాల్గొన్నాయ‌న్న ఆయ‌న‌.. వామపక్షాలు పాత్ర ఉందని నిన్న జెండాల ద్వారానే అర్థం అవుతుంద‌న్నారు.

ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ సర్వీసులు ఆపితే…  దానికి పరిణామాలు కూడా వాళ్లు చూడాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించిన స‌జ్జ‌ల‌.. నోటీసు ఇచ్చాం కనుక ప్రభుత్వం ఏం చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అని మండిప‌డ్డారు.. పరిస్థితిని వాళ్ళకు వాళ్లే చెడగొట్టుకుంటున్నారు.. రాజకీయ కారణాలు ముందుకు తోసుకుని వస్తున్నాయనిపిస్తోంద‌ని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.. సాధారణ ప్రభుత్వ సేవలు యథాతధంగా కొనసాగటానికి ఏం చేయాలో ప్రభుత్వం అన్నీ చేస్తుంది.. చూసే వాళ్లను బట్టి ఉంటుంద‌ని.. ఇంత మంది ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదు కదా? అని ఎదురుప్ర‌శ్నించారు.. ఉద్యోగులు వాళ్లకు కావాల్సిన సమస్యలు ప్రాధాన్యత వారీగా ఎందుకు లిస్ట్ చేయటం లేదో అర్ధం కావటం లేదు? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు స‌జ్జ‌ల‌.. సమాన పనికి సమాన వేతనం నుంచి 75 డిమాండ్లను ఒకేసారి పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అని నిల‌దీశారు.. పీఆర్సీకి సంబంధించి మూడు నాలుగు డిమాండ్ల పై చర్చలు చేస్తే పరిష్కారం అవటానికి అవకాశం ఉంటుంద‌ని.. ఓపెన్ మైండ్ తో మంత్రులు రావటం లేదని స్టీరింగ్ కమిటీ నేతలు చెప్పటం త‌ప్పే అన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.