మదనపల్లె:మదనపల్లె పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న నిందితుడ్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. నేడు మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ద్విచక్రవాహనాలు వరుసగా చోరీ అవుతుండటంతో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశానుసారం రెండో పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు కొంతమంది సిబ్బందిని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశామన్నారు.
మంగళవారం వారపుసంత కావడంతో ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాలు తనిఖీ ముమ్మరం చేశామన్నారు. అందులోనూ ఇదే మార్గంలో సంతకు వెళ్లే వారు ఉండటంతో తనిఖీ నిర్వహిస్తుండగా గుర్రంకొండ మండలం సంఘ సముద్రం పంచాయతీ కొత్తపల్లె గ్రామానికి చెందిన పఠాన్ నూర్ మహమ్మద్ పోలీసు సిబ్బందిని చూసి తప్పించుకుని వెళ్తుండగా పట్టుకున్నారన్నారు. అతను వెళ్తున్న ద్విచక్రవాహనం చోరీ చేసిందిగా గుర్తించి విచారించగా అతను ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారన్నారు.
నిందితుడైన నూర్మహమ్మద్ను విచారించగా మదనపల్లె పట్టణంలోని దేవళంవీధికి చెందిన షేక్ సైషా ఆలీ ప్రధాన నిందితుడని అతను ద్విచక్రవాహనాలు చోరీ చేసి తనకు తెచ్చి ఇస్తుంటాడని ఆ వాహనాలను ఎవరికి తెలియకుండా అమ్మి డబ్బు ఇచ్చి కమిషన్ తీసుకుంటానని తేలిందన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గుర్రంకొండ మండలంలోని కొత్తపల్లె సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో దాచి ఉంచిన 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

