దలైలామాకు శుభాకాంక్షలు చెప్పిన రఘురాజు
దలైలామాకు జన్మదిన
శుభాకాంక్షలు చెప్పిన రఘురామ
అమరావతి: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజూ వేర్వేరు సామాజింకాంశాలపై లేఖాస్త్రాలను రాస్తూ సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీడియా ముందుకు వచ్చే వీలు లేకుండాపోవడంతో ముఖ్యమంత్రికి రోజూ లేఖలను రాస్తోన్నారు.
ప్రఖ్యాత బౌద్ద మత గురువు దలైలామాకు రఘురామ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు ఇదివరకెప్పుడో దలైలామాతో కలిసి దిగిన ఓ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమరావతిలో బౌద్ధ ఉత్సవాలను నిర్వహించినప్పుడు ఈ కార్యక్రమానికి హాజరైన దలైలామాతో ఈ ఫొటో దిగినట్టుగా భావిస్తోన్నారు. దలైలామా ఇలాంటి పుట్టినరోజు ఉత్సవాలను మరెన్నో జరుపుకోవాలని రఘురామ అకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదం లభించాలని కోరుకున్నారు.
దలైలామా కు ప్రధాని మోడీ ఫోన్
దలైలామా జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా దలైలామాతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయురారోగ్యాలతో జీవించాలని అకాంక్షించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని మోడీ. దలైలామాతో సంభాషించినట్లు ధర్మశాల తెలిపింది. కాగా- సందర్భం ఏదైనప్పటికీ రఘురామ మాత్రం వైఎస్ జగన్‌కు తన లేఖాస్త్రాలను సంధించడాన్ని విస్మరించట్లేదు. మంగళవారం నాడూ ఆయన మరో లేఖను రాశారు.ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారు. సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. శాసనం ద్వారా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులను సైతం సజ్జల కించపరుస్తోన్నారంటూ ఆరోపించారు.