National News Networks

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు

Post top

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జాతీయ రాజకీయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ కుదుపు కుదిపారు. స్తబ్ధుగా ఉన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులను జాగృతపరిచారు. నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఒక్కటవ్వాలనే ఆకాంక్షను వారిలో రగిలించారు కేసీఆర్‌. బీజేపీ వ్యతిరేక శిబిరానికి ఓ ఊపు తెచ్చారు. కమలంపై భగ్గుమంటున్న ముఖ్యమంత్రులను ఏకం చేసే బాధ్యతను బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆమె కేసీఆర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో మాట్లాడారు కూడా! అయితే మమతా బెనర్జీ నిర్వహించబోతున్న ముఖ్యమంత్రల సమావేశానికి కేసీఆర్‌ హాజరవుతారా లేదా అన్నది ఇంకా తేలలేదు.థర్డ్‌ ఫ్రంట్‌ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్‌ రహిత మూడో ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యంగా మమతా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యమేనని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఏ ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్‌తో సత్సంబంధాలు లేవని, కాంగ్రెస్‌ దాని దారిలో అది వెళుతోందని, తమ దారిలో తాము పయనిస్తామని మమతా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ లక్ష్యమైనా, మమతాబెనర్జీ ధ్యేయమైనా ఒక్కటే.. అది ఢిల్లీ కోటలు బద్దలు కొట్టాలి. నరేంద్ర మోదీ సర్కారును గద్దె దించాలి. సమాఖ్య స్వరూపాన్ని కాపాడుకోవాలి.

అధ్యక్ష తరహా పాలన అనే ఆలోచనకు ఆదిలోనే అడ్డు పడాలి. మోదీ సర్కార్‌పై మిగతా విపక్షాల ముఖ్యమంత్రుల ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ. మమతా బెనర్జీ, స్టాలిన్‌లు మాత్రం మోదీపై గుర్రుగానే ఉన్నారు. కేసీఆర్‌ కూడా వారితో జతకలిశారు. మోదీపై కేసీఆర్‌ తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించాడనికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జాతీయ స్థాయిలో బలమైన కాంగ్రెసేతర కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు.త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేతో సమావేశం కానున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో ఇంతకు ముందే జాతీయస్థాయిలో బీజేపీయేతర కూటమి అవసరాన్ని చర్చించారు. అలాగే లెఫ్ట్‌ నేతలు సీతారాం ఏచూరి, ఎ. రాజాతో ముచ్చటించారు. ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్‌తోనూ గతంలో కేసీఆర్‌ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించడం కోసం కేసీఆర్‌ ఏడాది కాలంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ, ఆర్ధిక, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదనే దానిపై స్పష్టమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు కేసీఆర్‌. వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు.అయితే రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ముందు ప్రజలను సంఘటితం చేయాలన్నది కేసీఆర్‌ ఆలోచన. ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు కేసీఆర్‌. మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని ఎక్కడా చెప్పకుండానే దేశంలో బలమైన కూటమి అవసరాన్ని పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. ప్రజలలో చైతన్యం వస్తే రాజకీయ పార్టీలు వాటంతట అవే తన దగ్గరకు వస్తాయన్నది కేసీఆర్‌ నమ్మకం. బీజేపీని ఎందుకు ఓడించాలన్నదానిపై ప్రజలలో అవగాహన తీసుకురావాలన్నది కేసీఆర్‌ ఆలోచన. ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న కేసీఆర్‌కు అపారమైన రాజకీయానుభవం ఉంది. ఆ అనుభవాన్ని సోపానంగా చేసుకుని జాతీయ రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటున్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే ఫ్రంట్‌ల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ మాటలు వింటుంటే దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆయన ముందుకు వెళుతున్నారని అర్థమవుతోంది.

తన లక్ష్యం బీజేపీనే అయినప్పటికీ ఈ విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దగ్గరకు రానివ్వడం లేదు.కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఏమంత కష్టమైన పని కాదని మొన్నామధ్య ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. ఏ విధంగా మోదీ సర్కార్‌ను ఓడించవచ్చో లెక్కలేసి మరీ చెప్పారు. కేసీఆర్‌ లెక్కలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే పక్కా ప్లాన్‌తోనే వెళ్లాలని, తొందరపడి ఓ నిర్ణయానికి రాకూడదని కేసీఆర్‌ అనుకుంటున్నారు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, డీఎంకే, జేఎంఎం, ఆర్‌జేడీలు గళం విప్పుతున్నాయి. ఈ పార్టీలకు ఉన్న ఎంపీల సంఖ్య అంతంత మాత్రమే! పీకే చెప్పినట్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీలన్ని కలిసి కనీసం 200 సీట్లను గెల్చుకోలిగితే మోదీని దింపడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్‌ లేని ఫ్రంట్‌ సాధ్యమవుతుందా? ఒకవేళ ఏర్పడినా బీజేపీని గద్దెదింపగలిగేంత సంఖ్యా బలాన్ని సాధించగలదా? చూడాలి.

Post bottom

Leave A Reply

Your email address will not be published.