7 రోజుల క్వారంటైన్
ముంబై ఫిబ్రవరి 11: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్ కూడా ముగియబోతోంది. ఇక కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన నిబంధనను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. విదేశాల నుంచి చేరుకున్న తర్వాత 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను కూడా కేంద్రం తొలగించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికులు అంతా ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ బదులు వారు చేరుకున్న 14 రోజుల పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేశారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటలలోపు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్టును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. లేదా దేశాల నుంచి వారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి. 82 దేశాల జాబితాను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. జాబితాలో అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, సౌదీ ఆరేబియా, ఇజ్రాయిల్, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, కెనడా, నెదర్లాండ్స్, మెక్సికో తదితర దేశాలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ పరీక్షలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని నేరుగా ఆస్పత్రికి తరలిస్తారు.
పరీక్షలలో పాజిటివ్ అని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు చేపడతారు. అలాగే పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణకు గాను ఇన్సాకాగ్ నెట్‌వర్క్‌కు పంపిస్తారుఓడరేవులు, సరిహద్దుల గుండా వచ్చే వారికి ఇవే నిబంధనలు వర్తిస్తాయి. కాకపోతే వీరికి ఆన్‌లైన్ నమోదు సౌకర్యం లేదు. ఇక ఐదేళ్లలోపు పిల్లల కోవిడ్ పరీక్షల నుంచి మినహయింపు ఇచ్చారు. వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్త చికిత్స పొందాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో నిబంధనల మేరకు 2 శాతం మంది నుంచి శాంపిళ్లను తీసుకుంటారు. ఇంత వరకు ముప్పు ఉన్నదేశాల నుంచి వచ్చే వారికి కొన్ని నిబంధనలు ఉండేవి. ముప్పు ఉన్న దేశాలు అనే నిబంధనను తొలగించింది కేంద్రం.