National News Networks

ఇసుక విధానం మార్చండి మహాప్రభో!

Post top

 

నిత్యం ఏదో ఒక అంశంపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , ప్రజల మనోభావాలను  తన లేఖల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ రాజు ఇవాళ మరో లేఖలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఇసుక విధానంలో ఉన్న లోపాలు ఎత్తి చూపారు. తక్షణమే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇసుక విధానాన్ని రూపొందించాలని ఎంపి రఘురామ సూచించారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇది.

జులై 5, 2021
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: నిరాటంకంగా ఇసుక సరఫరా చేసే అంశం
సూచిక: నవ సూచనలు (వినమ్రతతో) లేఖ 7
ముఖ్యమంత్రి గారూ,
రాష్ట్రంలో ఇసుక ధరలు తగ్గించేందుకు, అక్రమ ఇసుక నిల్వలు అరికట్టేందుకు, బ్లాక్ మార్కెట్ లో ఇసుక అమ్మకాలను నిలుపుదల చేసేందుకు 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన ఇసుక సరఫరా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. నదీ ప్రవాహ ప్రాంతాలలో ఇసుకను తవ్వి తీస్తున్న అక్రమ తవ్వకందారులను గత ప్రభుత్వం ఉపేక్షించిందని, మధ్య దళారీలకు అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించిదని తద్వారా నిజమైన అవసరం ఉన్నవారికి తీరని అన్యాయం జరిగిందని మనం గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాం.
ఒక వైపు పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇసుక తవ్వకాలను చేపట్టడం, అదే సమయంలో సరసమైన ధరలకు ఇసుకను వినియోగదారుడికి చేరవేయడం, ఈ రెండింటితో బాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చేయడమనే కీలక అంశాలను మిళితం చేసి నూతన ఇసుక సరఫరా పాలసీని రూపొందించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంలో, జరిగిన తదనంతర పరిణామాలలో, ఇసుక సరఫరా బాధ్యతను కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఆనాటి నుంచి ఇసుక కొరత మరింత తీవ్రమైంది. ఇసుక కొరత ఏర్పడటంతో దాని ప్రభావం ధరలపై పడి ఇసుక రేట్లు ఆకాశానికి అంటాయి. ఇసుక లభ్యత సన్నగిల్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం స్థంభించిపోయింది. దీనివల్ల సిమెంటు, ఇనుము అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ పరిణామాల ఫలితంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయి. ఈ అన్ని అంశాలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలు తలెత్తిన కొత్తలోనే నేను ఈ అంశాలన్నింటిని మీ దృష్టికి తీసుకువచ్చాను. అయితే మీరు నేను చెప్పిన విషయాలను అర్ధం చేసుకుని అందుకు పరిష్కారం ఆలోచించకుండా నన్ను అపార్థం చేసుకుని నాపై కక్ష పెంచుకున్నారు.
ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఇంకో ఇసుక పాలసీని తీసుకువచ్చారు. మీరు తీసుకువచ్చిన ఈ రెండవ ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైంది. పర్యవసానంగా మీరు మూడో ఇసుక పాలసీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం ఎంతో ఆర్భాటమైన పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇసుక తవ్వకం, అమ్మకం నుంచి సరఫరా వరకూ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (JPVL) అనే ప్రయివేటు కంపెనీకి ధారాదత్తం చేశారు. ఏపి మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APMDC) రాష్ట్రంలోని అన్ని ఇసుకరీచ్ లను ఈ కంపెనీకి కట్టబెట్టేసింది. అయితే ‘‘అంత ఉరుము ఉరిమి… ఇంతేనా కురిసింది’’ అన్నట్లు ఆ కంపెనీ 300 ఇసుక రీచ్ లలో కనీసం సగం రీచ్ లలో కూడా ఇప్పటికీ ఇసుక తవ్వకాలను ప్రారంభించలేకపోయింది.
నూతన పాలసీ ప్రకారం ఇసుక రీచ్ ల వద్దకే వెళ్లి కొనుగోలుదారుడు ఇసుక నాణ్యత పరిశీలించుకోవచ్చు. అక్కడి ఇసుక నాణ్యత నచ్చితే దాన్ని ర్యాంప్ వద్దే కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ‘‘గతి లేనమ్మకు గంజే పానకం’’ అన్నట్లుగా ఉంది.
మధ్య దళారీల ప్రమేయం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని మనం ఇచ్చిన హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల వద్ద మధ్యదళారీల ప్రమేయమే ఎక్కువగా కనిపిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఇసుక కు ఒకే ధర ఉంటుందని మనం ఇచ్చిన హామీ కూడా ఎక్కడా అమలు జరగడం లేదు. రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఒకే రేటు ఇవ్వలేమని ఇసుక సరఫరాదారులు చెబుతున్నారు. మీరు చేసిన మరో మేలు ఏమిటంటే అదనంగా డ్రైవర్ కు వెయిటింగ్ చార్జి భారాన్ని వినియోగదారుడిపైనే వేస్తున్నారు. దీనికి క్లీనర్, హెల్పర్ చార్జీలు కూడా అదనంగా బాదుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు మరో కొత్త బెడద వచ్చిపడింది. అదేమిటంటే ‘‘జగనన్న ఇళ్ల కాలనీ’’ల అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వారికి ఇసుక సరఫరా చేస్తారట.
ఇసుక లభ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో అది పెద్ద అంశం కాదన్నట్లుగా మాట్లాడారు. రూ.765 కోట్ల ఆదాయం తీసుకువచ్చేందుకు తామంతా కృతనిశ్చయంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం శూన్యం. మీరు తీసుకువచ్చిన ఇసుక పాలసీలో ఎక్కడ లోపం ఉంది? ఇసుక ధరలు విపరీతంగా ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇసుక లభ్యత ఎందుకు తగ్గిపోతున్నది? అనే ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానం దొరకడం లేదు.
అంతా డిజిటలైజ్ చేశామని ఇక ఏ మాత్రం అవినీతి జరగదని మీరు ఎంతో నమ్మకంగా చెప్పినా కూడా రాష్ట్రంలో మొత్తం ఇసుక బ్లాక్ మార్కెట్ దందా ఎందుకు నడుస్తున్నదో అర్ధం కావడం లేదు. ఇసుక అమ్మకాలలో అవినీతి విచ్చలవిడిగా ఎందుకు పెరిగిపోయిందో కూడా అర్ధం కావడం లేదు. ఇసుక మాఫియా రాజ్యం ఏలుతూనే ఉన్నది. వీటన్నింటి పర్యవసానంగా సామాన్యుడికి ఇసుక లభ్యత తగ్గిపోతున్నది. కాపురం చేసే కళ కాళ్ల పారాణి నాడే తెలుస్తుందని ఒక సామెత ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణానికి 37 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతుంది. వీటికి తోడు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మరింకెంత కావాలో ఒక్క సారి అంచనా వేసుకోవచ్చు. ఈ సాధారణ లెక్కలను కూడా మన ప్రభుత్వం ఆలోచించడం లేదనిపిస్తున్నది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇసుకను సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ప్రభుత్వ అధికారులు చాలా చోట్ల జగనన్న కాలనీలలో ఇళ్లను ఎవరికి వారే కట్టుకోవాలని కూడా ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి వారు తక్షణమే ఇళ్లు నిర్మించుకోవడం మొదలు పెట్టాలని, లేకపోతే వారి పట్టాలు రద్దు చేసి వేరొకరికి కేటాయించేస్తామని చాలా చోట్ల బెదిరిస్తున్నట్లు పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడుతున్నాయి.
ఈ సందర్భంగా మీ తెలివితేటలను నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కేంద్ర ప్రభుత్వం MNREGA నిధుల నుంచి రోడ్లు ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తున్నా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటి నిర్మాణానికి 1.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నా కూడా ఈ స్కీమ్ మొత్తానికి మీ పేరు పెట్టుకుని ‘‘జగనన్న ఇళ్ల కాలనీలు’’ అంటూ మొత్తం క్రెడిట్ ను మీరే సొంతం చేసుకోవడానికి మీరు వేసిన ఎత్తుగడను ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
పాపం ప్రజలు అందరూ కూడా పేద వారిపై ఎంతో ప్రేమతో మొత్తం ఖర్చు మీరే భరిస్తున్నారని అనుకుంటున్నారు. మీ ‘‘జగనన్న కాలనీ’’లో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నదని ఏదో ఒక మూలనన్నా చెబితే బాగుంటుందేమో ఆలోచించండి. ఇలా తెలిసీ తెలియనట్లు, చూచాయగా చెప్పినా కూడా కేంద్ర నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మన ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించేందుకు దీనివల్ల మరింత వీలుకలుగుతుంది. అలా అదనంగా వచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లకు కూడా మనం ‘‘జగనన్న’’ పేరు పెట్టుకుంటే మన ప్రజలు మరింతగా సంతోష పడతారు.
అవసరమైనంత ఇసుకను సరసమైన ధరలో అందించే విధంగా మీ విధానం ఉంటే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఇచ్చే ఉచిత ఇసుక పథకం వద్దు బాబోయ్ అంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. మీరు మూడు నాలుగు ఇసుక పాలసీలు తీసుకువచ్చి పరిస్థితి మరింత దారుణంగా మార్చడాన్ని చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ‘‘ అంచు డాబే కానీ పంచె డాబు లేదు’’.
అందువల్ల మీరు తక్షణమే మీ ప్రియమైన ఇసుక పాలసీని ఇప్పటికైనా మార్చుకోండి. సరసమైన ధరకు నాణ్యమైన ఇసుకను అవసరం ఉన్నంత పరిమాణంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోండి. తద్వారా రాష్ట్రంలో మళ్లీ నిర్మాణ రంగం పుంజుకునే విధంగా చర్యలు తీసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుంది. నిర్మాణ రంగం మళ్లీ తన కార్యకలాపాలు ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. పేద వారు కష్టపడి పని చేసుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తారు.
సమాజంపై ఎంతో ప్రభావం చూపుతున్న మీ ఇసుక పాలసీని తక్షణమే మార్చుకుంటారని తద్వారా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకునేలా చేస్తారని ఆశిస్తూ….
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

Post bottom

Leave A Reply

Your email address will not be published.