National News Networks

ముస్లింలకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Post top
  • మే 3న రంజాన్.. కనిపించిన నెలవంక
  • మంచి సందేశాన్ని అందించే పండుగ అంటూ కేసీఆర్ ప్రకటన
  • ముస్లింలు అల్లా దీవెనలు పొందాలంటూ ఆకాంక్ష
ఈ నెల 3వ తేదీన రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లిం మతపెద్దలు రంజాన్ మంగళవారం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 
ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ, రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అభిలషించారు.

కాగా, ముస్లింల సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని కేసీఆర్ తెలిపారు. షాదీ ముబారక్ ద్వారా పేద ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లలకు పెళ్లి ఖర్చు కోసం రూ.1,00,116 అందజేస్తున్నామని చెప్పారు. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు వీలుగా ప్రత్యేక ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. లౌకిక వాదం, మత సామరస్యం పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.