యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట యూత్ JAC ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రిలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి అవినీతికి పాల్పడిందని, ఈఓను సస్పెండ్ చేయాలంటూ యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలోని మెయిన్ రోడ్డుపై స్థానికులు, ఆటోడ్రైవర్లు, యువకులు, భక్తులు పెద్దఎత్తున మెరుపు ధర్నాకు దిగారు.
యాదాద్రి ఆలయ పున:ప్రారంభం తర్వాత ఆలయ ఈఓ గీతారెడ్డి ఒంటెద్దు పోకడతో ముందుకు వెళుతోందని స్థానికులు మండిపడ్డారు. యాదాద్రి ఆలయ పనుల్లోనూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇటీవల యాదాద్రి ఆలయ ఈవో వైఖరిని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందంటూ నిరసన తెలిపారు.
టూవీలర్ సహా భక్తుల అన్ని రకాల వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో యాదగిరిగుట్ట పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల ధర్నాతో యాదగిరిగుట్టలో ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. పలువురి ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.