జిఒలు వెబ్ సెట్ లో పెట్టాలి: హైకోర్టు
హైదరాబాద్: దళిత బంధు పథకంపై జారీ చేసిన జిఒలు వెబ్ సైట్ లో పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జిఒలు అన్నింటిని 24 గంటల్లోగా వెబ్ సైట్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలుపై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఇరువర్గాల తరఫు వాదనలు హైకోర్టు విన్నది. మార్గదర్శకాలు లేకుండానే నిధులు విడుదల చేసి, లబ్ధిదారులకు అందచేశారని పిటిషనర్ అభ్యంతరం తెలపగా, మార్గదర్శకాలు జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు వెబ్ సైట్ లో జిఒలు పెట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపగా, ప్రజల ముందు పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వివరణ నమోదు చేసుకున్న హైకోర్టు, జిఒలన్నింటిని 24 గంటల్లోగా వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించింది.