National News Networks

గజ్వేల్ వెళ్లకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్ రెడ్డి

Post top

మేడ్చల్: గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. తప్పకుండా వస్తానని… వచ్చే నెల గజ్వేల్ వెళ్లి తీరుతానని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. ఆ తేదీకి వెళ్లి తీరుతానన్నారు.

తన పర్యటనకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తానని… వెళ్లని పక్షంలో గుండు కొట్టించుకుంటానని రేవంత్ రెడ్డి శపథం చేశారు. మూడు చింతలపల్లిలో ప్రారంభమైన “దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష” లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష కొనసాగుతుందన్నారు. బిఆర్.అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కుమ్రం భీమ్, సేవాలాల్ సాక్షి గా చెబుతున్నాను… మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజల వల్లే కొట్లాడే అవకాశం దక్కిందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కుట్రలు కుతంత్రాలు చేసి.. కెసిఆర్ నన్ను ఓడించారు. కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడిస్తే.. తన అక్రమాలకు అడ్డుఅదుపు ఉండదని భావించారు. మల్కాజిగిరి ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వదించారు. మూడుచింతలపల్లికి దత్తత తీసుకొని రూ.28 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. కెసిఆర్ దత్తత తీసుకున్న తర్వాత నే కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. దత్తత ముసుగులో ఈ ప్రాంతాన్ని వంచిస్తున్నడు. లక్ష్మాపూర్ కు తెలంగాణ ముఖ చిత్రం లో గుర్తింపు లేదు. ధరణి లో భూముల వివరాలు చేర్చలేదు. ఇక్క ఫించన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ ఇచ్చామని ప్లెక్సీ లు పెట్టారు. ఒరేయి సన్నాసులారా.. ఊళ్లలోకి పోయి అడగండి.. 57 ఏళ్ల వారికి ఫించన్లు వచ్చాయా అని రేవంత్ రెడ్డి అన్నారు.

దళిత వాడల్లోకి అందరికీ ఇళ్లు కట్టిస్తానని 247 ఇళ్లు కూలగొట్టారు. చిన్న ముల్కనూరులో కొత్త ఇళ్లు కట్టిస్తానని ఉన్న ఇళ్లు కూలగొడితే ఆడపిల్లల స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. చిన్నముల్కనూరులో ఆరేళ్లు దాటిపోయినా కొత్త ఇళ్ల జాడలేదు. దత్తత తీసుకున్న గ్రామాల్లో 57 ఏళ్లకే ఫించన్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అంటున్న కెసిఆర్ మేడ్చల్ జిల్లా లో ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.15 లక్షల కోట్లు ఖర్చయ్యాయి.. ఈ గ్రామాలకు ఎన్ని పైసలు వచ్చాయో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పాట ఈ రోజు నిజమవుతోందన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ ను ఇస్తే అప్పుల ఊబిలోకి నెట్టాడన్నారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొందేందుకు నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.10 వేలు పరిహారం అని చెప్పి ఎన్నికల తరువాత పైసా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ మాదిరిగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మోసం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులకు రూ.10 వేలు ఇవ్వలేని కెసిఆర్ దళిత బంధు పథక కింద హుజూరాబాద్ లో రూ.10 లక్షల చొప్పున ఇస్తాడా అని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. హుజురాబాద్ దళిత బిడ్డలకు దండం పెడుతున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల కుటుంబాల బాధ్యత మీమీద ఉందని గుర్తు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు లబ్ధిదారుల ఎంపిక జాబితా కొనసాగుతుందని, డబ్బులు ఇవ్వరన్నారు. ఓట్లు వేస్తే.. రూ.10 లక్షలు ఇస్తామని లిటిగేషన్స్ పెడతారు. లబ్ధిదారుల వద్దకు అధికారులు, టిఆర్ఎస్ నాయకులు వచ్చి కెసిఆర్ ఆర్ ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే నాకు చెప్పండి భరతం పడతానని హెచ్చరించారు. సిఎం కెసిఆర్ మనువడు హిమాన్షు రావు చదివే స్కూల్ లో పేద ప్రజల పిల్లలు చదివేలా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్ లను కాంగ్రెస్ అమలు చేస్తే వాటిని కెసిఆర్ నాశనం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బిసిలకు గొర్రెలు, బర్రెలు ఇస్తూ.. పేదలు అలాగే ఉండాలని.. తన మనుమడు రాజ్యం ఏలాలని కెసిఆర్ భావిస్తున్నారని రేవంత్ అన్నారు. ఈటల రాజేందర్ భూ ఆక్రమణ పై రాత్రికి రాత్రి నివేదిక లు ఇచ్చిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత చర్యలు తీసుకోకుండా చేతుకు కట్టుకుని కూర్చుకున్నారన్నారు. రేపు సిఎం కెసిఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి లో పర్యటిస్తానని, ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు. వాసాలమర్రి లో దళితుల ఖాతాలో రూ.10 లక్షలు వేస్తానని చెప్పి.. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఖాతాలో వేసినట్లు జిఒ ఇచ్చారు. ఇలా ప్రతీది కేసీఆర్ మోసం, దగా చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం దత్తత గ్రామానికే కెసిఆర్ ఏమీ చేయలేదు, అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ ఈ సభా వేదిక ద్వారా పెట్టనున్నారు. దళిత బస్తీలో ఈరోజు రాత్రి రేవంత్ బస చేయనున్నారు. రేపు దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.