చిన్న తరహా ప్రాజెక్టులతో పంటలు కళకళ
విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల ఆయకట్టు పంటలతో కళకళలాడుతోంది. ఖరీఫ్ కోతలు పూర్తయినా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో రబీ పంటలకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. సమృద్ధిగా నీరు వస్తుండటంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉంది.భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాలు, ఏపీఎస్సైడీసీ పరిధిలోని ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు ఉండగా, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార, ఏలేరు తదితర నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి.
దాంతో ఎన్నడూ నీటి చుక్క చేరని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. వాటి కింద ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు ఆనందంతో ఉన్నారు.వర్షాఛాయ ప్రాంతం అనంతపురం జిల్లాలో పెన్నా బేసిన్‌లోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దశాబ్దాల తర్వాత నిండింది. దేశంలో అత్యల్ఫ వర్షపాతం నమోదయ్యే వేదవతి (హగరి) దశాబ్దాల తర్వాత ఉరకలెత్తడంతో ఎన్నడూ నిండని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కూడా నిండింది. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నది ఉప్పొంగడంతో మడ్డువలస ప్రాజెక్టు ఈ ఏడాది రెండుసార్లు నిండింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు అన్ని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి.ఇప్పటి వరకు ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు కూడా నీరందని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు.. ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరందుకుంటోంది. ఏమాత్రం వృథా కాకుండా యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకూ నీళ్లందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు.