National News Networks

ఐఏఎస్ అధికారుల్లో అంతర్మధనం

Post top

విజయవాడ, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఉన్నతాధికారులు ఎందుకు వెళ్లిపోతున్నారు? తొలుత అన్నా అన్నా అంటూ అక్కున చేర్చుకున్న సీనియర్ ఐఏఎస్‌లు, విశ్రాంత ఉన్నతాధికారులను ఆ తర్వాత సీఎం జగన్ అత్యంత అవమానకర రీతిలో ఎందుకు జెల్లకొట్టి మరీ సాగనంపుతున్నారు? తాజాగా ప్రవీణ్ ప్రకాశ్, గౌతమ్ సవాంగ్‌లపై ఎందుకు బదిలీ వేటు పడిందనే అంశంపై వెలగపూడి సచివాలయం వేదికగా ఉన్నతాధికారుల్లో చర్చ మాత్రం రచ్చ రచ్చగా జరుగుతోంది. అంతేకాదు.. సీఎం జగన్ వ్యవహార శైలిపై కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది.2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్.వి. సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్.వి. సుబ్రహ్మణ్యంని అదే పదవిలో కొనసాగించారు సీఎం జగన్. మరోవైపు సీఎంవోలోకి రిటైర్డ్ ఐఏఎస్‌లు పీవీ రమేష్, కల్లాం అజేయ్ రెడ్డిలను సైతం తీసుకున్నారు సీఎం జగన్. ఆ క్రమంలో అన్నా అన్నా అన్నీ మీరే అంటూ అటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఇటు ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌లను కూడా సీఎం ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో తామే అత్యంత కీలకమనే భావనలోకి సదరు అధికారులు సర్రున జారీపోయారు.

అంతా ఒకే అనుకుంటున్న సమయంలో సరిగ్గా.. ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ నుంచి తొలగించి.. బాపట్లకు సాగనంపేశారు.దాంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్థాయి ఎంటీ.. ఆయన్ని బాపట్ల పంపడం ఏమిటనే టాక్ అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారులు అసోసియేషన్‌లో సైతం వైరల్ అయింది. దీని ద్వారా సీఎం జగన్ వైఖరి ఏమిటో ఐఏఎస్‌లకు కొద్దిగా అర్థమైందని సమాచారం. మరోవైపు.. తన పేషీలో ఉన్న పీవీ రమేష్, కల్లం అజేయ్ రెడ్డిల అధికారాలకు సైతం సీఎం జగన్ కట్ చేశారు. దీంతో సీఎం జగన్ అంటే ఏమిటో వీరిద్దరికీ బాగా అర్థమైందని.. జననేత గారి పనులన్నీ పొమ్మన లేకుండా పొగపెట్టేలా ఉంటాయంటూ పీవీ రమేష్.. తన సన్నిహితుల వద్ద పేర్కొని.. అక్కడ నుంచి చాలా కూల్‌గా జారుకున్నారని.. కానీ మరో మాజీ ఐఏఎస్ కల్లం అజేయ్ రెడ్డి మాత్రం.. అదే సీటులో ఉంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ మాజీ ఐఏఎస్‌ కల్లాం అజేయ్ రెడ్డితో న్యాయమూర్తులపై ఎంత విషం కక్కించాలో సీఎం జగన్ అంతా కక్కించారని.. ఆ తర్వాత ఆయనతో పని అయిపోయిందని భావించి.. సదరు కల్లాం గారిని సైడ్ చేశారనే టాక్ సైతం వెలగపూడి వేదికగా నాడు నడిచింది. నాటి సీఎంవోలో ఒకానొక సమయంలో మగమహారాజులుగా చెలమణి అయిన వీరిద్దరు.. తాజాగా వీరిద్దరు సీఎంవోలోకి వెళ్లాలంటే.. మాత్రం తప్పని సరిగా పర్మిషన్ ఉండాలనే కండిషన్ పెట్టినట్లు టాక్ అయితే నడుస్తోంది. ఇక మరో ఐఏఎస్ సార్.. ప్రవీణ్ ప్రకాశ్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఓ అరాచకమని సాక్షాత్తూ సీఎంవోలోని వారే గుసగుసలాడుకొవడం గమనార్హం.

అంతేకాదు ఈ ప్రవీణ్ ప్రకాశ్ లీలలు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారంటే.. ఇక ఈ సార్ గారి ఎంతటి ఘనాపాటో ఇట్టే అర్థమవుతోందంటారు. తన పరిథి దాటి లేని అధికారాలు మరి కొని తెచ్చుకొని .. తోటి ఐఏఎస్‌లపై తన పెత్తనం చెలాయించడంలో వీరు సిద్ధహస్తలనే టాక్ నిన్న మొన్నటి వరకు యమ జోరుగా నడిచింది. ఈ సార్ గారి తీరు వల్ల ఐఎఎస్‌లు తీవ్ర మనోవేదనకు గురయ్యారనే చర్చ కూడా నడిచింది. ఈ సార్ గారు చెప్పిందే వేదం.. దానిని అమలు చేయకండే.. మహాపాపం అన్నట్లుగా ఏమాత్రం కసరత్తు లేకుండా శాఖలను విభజిస్తూ….. ఆ క్రమంలో సీనియర్లను ఎడా పెడా బదిలీ చేస్తూ ఈ ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర దూమారాన్నే రేపాయంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ ప్రవీణ్ ప్రకాశ్ గారి ప్రావీణ్యం కొండవీటి చానతాడంత ఉంటుందని.. అలాగే సహచర ఐఏఎస్‌లతోనేకాదు.. సీనియర్ ఐఏఎస్‌లతో సైతం ఈ ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహరించే తీరు అనేక సందర్భాల్లో వివాదాస్పదం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ సార్‌గారి పురాణం అంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వరకు వెళ్లినా.. ప్రవీణ్ ప్రకాశ్‌ను ఈ సీఎం సార్.. కీప్ ఈట్ అప్ అనే రెంజ్‌లో పరోక్షంగా భుజం చరిచి మరీ ప్రోత్సహించేవారనే చర్చ కూడా దాదాపు ఇటీవల వరకు నడించింది.

ఈ ప్రవీణ్ సార్.. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోస్ట్‌కు ఇంచార్జ్‌గా ఉంటూ.. ప్రధాన కార్యదర్శికి సంబంధం లేకుండా అన్నీ తానే అయి ఉత్తర్వులు జారీ చేసేవారనే.. ఇలా తనకు ఇంటా బయటా కావాల్సిన పనులు చేసి పెడుతున్న ప్రవీణ్ ప్రకాశ్‌తో పని అయిపోయిందని సీఎం జగన్ భావించారని.. ఆ క్రమంలోనే సదరు సార్.. అధికారాల్లో కూడా కోత విధించారని.. నిధానంగా .. ఆయన్ని అప్రాధాన్య పోస్ట్‌కు బదిలీ చేశారనే టాక్ అయితే వైరల్ అయింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే.. తానే పైన అని భావించిన ప్రవీణ్ ప్రకాశ్.. సీఎం జగన్ ప్రోద్బలంతో విర్రవీగి.. చివరకు ఆయనే ఈ.. సార్‌ను ఢిల్లీకి సాగనంపారని సమాచారం. దీంతో జగన్ తాను ఏమిటో.. తన పనులేమిటో చెప్పకనే చెప్పారనే టాక్ అయితే అమరావతిలో జోరుగా నడుస్తోంది.నమ్ముకున్నవారిని వదులుకోబోమని పదే పదే చెప్పుకునే సీఎం జగన్ తీరు పలు సందర్బాల్లో ఇలా బహిర్గతం కావడం పట్ల అల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఓ బయటకు కనబడని ఆందోళన అయితే స్పష్టమవుతోందనే టాక్.. తాజాగా వెలగపూడిలో నడుస్తోంది. సీఎం చెప్పారని ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే చివరకు అది తమకే చేటు చేస్తుందనే విషయాన్ని ఈ అధికారులు గ్రహించారని తెలుస్తోంది. సీఎం జగన్‌ను పూర్తిగా విశ్వసిస్తే వచ్చే ఫలితం ఏమిటో తెలుసుకోవాలని కొందరు ఉన్నతాధికారులు తాజాగా పేర్కొనడం గమనార్హం. తాజాగా ప్రవీణ్ ప్రకాష్‌ ఎపిసోడే అందుకు ఉదాహరణ అని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ప్రకాష్‌ అంశంలో సీఎం జగన్ తీరు పట్ల ఉన్నతాధికార వర్గాల్లో ఎటువంటి సానుభూతి అయితే కనిపించకపోవడం గమనించాలి.

ఇంకోవైపు డీజీపీ సవాంగ్ బదిలీ వ్యవహారం మరో రచ్చ అవుతోంది. జగన్ ప్రభుత్వం రాగానే.. డీజీపీగా సవాంగ్‌ను నియమించారు. అధికార పార్టీ కోసం, ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల కోసం… డీజీపీ పోస్టు గౌరవాన్ని తగ్గించే విధంగా సవాంగ్ వ్యవహరించారనే ఆరోపణలు అయితే గట్టిగానే ఉన్నాయి.కేవలం రాజకీయ పక్షాల్లోనే కాదు.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా గౌతమ్ సవాంగ్ తీరుపై తీవ్ర చర్చ నడిచేది. రాష్ట్ర చరిత్రలో ఏ డిజిపి ఇంతలా దిగజారి వ్యవహరించలేదనే విమర్శలు అయితే గట్టిగానే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడంతోపాటు ఆ పార్టీల నేతలనే కాదు.. కార్యకర్తలను సైతం తీవ్రంగా వేధించడంలో పోలీసు శాఖకు మంచి మార్కులే పడ్డాయి. చాలా మంది పోలీస్ అధికారులకు ఈ తరహా పనితీరు నచ్చకపోయినా… డీజీపీ కార్యాలయ స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో తప్పేది కాదని ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులే మథనపడిన సందర్భాలు కొకొల్లలు అని తెలుస్తోంది. ఏమైతేనేం.. ఈ వ్యవహారం రాష్ట్ర పోలీసు శాఖకు మచ్చగా మిగిలిందనే చర్చ అయితే మిగిలింది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సవాంగ్ దిగజారి వ్యవహరించారనే విమర్శలు నేటికి అలాగే ఉన్నాయి. అయితే ఇంత చేసినా గౌతమ్ సవాంగ్‌ను కూడా సీఎం జగన్ నమ్మలేదంటే పరిస్థితి ఏమిటనే చర్చ అయితే పోలీస్ శాఖలో నడుస్తోంది.

మరో ఏడాది సర్వీస్ ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసి.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వక పోవడంపై పెద్ద దుమారమే నడుస్తోంది. డీజీపీగా పనిచేసిన వ్యక్తిని జిఎడిలో రిపోర్ట్ చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల పోలీస్ శాఖలో ఓ విధమైన ఆందోళన నెలకొంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మార్పు తప్పుదనుకున్నప్పుడు.. వారిని అదే స్థాయిలో ఉండే వేరో స్థానానికి బదిలీ చేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం కనీసం పోస్టింగ్ ఎక్కడో కూడా చెప్పకుండా బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసిందీ జగన్ ప్రభుత్వం. ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో చర్చకు తెరలేపిన సిఎం జగన్.. సవాంగ్‌పై వేటుతో అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్… ఉన్నతాధికారులను అన్నా అన్నా అని పిలిచేవారని…దానిని ఆసరాగా చేసుకుని.. ఉన్నతాధికారులు మాత్రం ఓ రేంజ్‌లో చెలరేగిపోవడమే కాకుండా.. దీన్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారని… కానీ తాజా పరిణామాలతో వారంతా షాక్‌లో ఉన్నారని సమాచారం. దీంతో సీఎం జగన్ మాట వేరు… ఆయన చేతలు వేరని సదరు ఉన్నతాధికారులు చర్చకు తెర తీశారు. ఏది ఏమైనా జగనన్నా అని పిలిస్తే ఇక అంతేనన్న విషయం ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందనే చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే వైరల్ అవుతోంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.