National News Networks

సీఎం కేసీఆర్‌ సారొస్తారొస్తారా?

Post top
  • నేడు రాజ్‌భవన్‌లో ముందస్తుగా ఉగాది వేడుకలు
  • సీఎంను ఆహ్వానించిన గవర్నర్‌
  • విభేదాల వార్తల నేపథ్యంలో సీఎం హాజరుపై పెరిగిన ఆసక్తి
  • ఆ కార్యక్రమానికి రేవంత్, బండి సంజయ్‌ కూడా వచ్చే అవకాశం
  • రేపు ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు తలపెట్టిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉగాది రాజకీయాలు రంజుగా మారాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను తలపెట్టిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, విపక్షాల ముఖ్య నేతలు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే విభేదాల కారణంగా చాలా కాలంగా రాజ్‌భవన్‌ గడప తొక్కని సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు గవర్నర్‌ ఆహ్వా నం మేరకు వెళతారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

‘నూతన సంవత్సరం సందర్భంగా పాత చేదు జ్ఞాపకాలను మరిచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని పెద్దలు అంటుంటా రని.. పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లిన గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉగాదితో సమసిపోతాయా?, కొనసాగుతాయా? అన్నది శుక్రవారం తేలిపోతుంద’ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా రాజ్‌భవన్‌ ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలంతా ఎదురుపడే నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం కేసీఆర్‌ శనివారం ప్రత్యేకంగా ప్రగతిభవన్‌లోని జనహితలో ఉగాది వేడుకలను తలపెట్టారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. దానికి ఎవరెవరు హాజరువుతారనే దానిపై చర్చ జరుగుతోంది.

విభేదాలకు చెక్‌ పడేనా?
గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్‌ అడ్డాగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్‌గా తనకు అందాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తమిళిసై అంటున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు మొదటిసారిగా బహిర్గతమయ్యాయి.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటి నుంచి దూరం పెరిగినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి విన్నపాలు స్వీకరించడానికి రాజ్‌భవన్‌ గేటు వద్ద గ్రివెన్స్‌ బాక్స్‌ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం పంపే ప్రసంగాన్ని గవర్నర్‌ చదవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్‌ నేపథ్యంలో గణతంత్ర దినాన్ని సాదాసీదాగా నిర్వహించాలని, గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గవర్నర్‌ ఇందుకు భిన్నంగా గణతంత్ర వేడుకల్లో సొంతంగా ప్రసంగించారు. అందులో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని గవర్నర్‌ పేర్కొనడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి.

దానిని గవర్నర్‌ తప్పుపట్టారు కూడా. మరోవైపు సమ్మక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి హెలికాప్టర్‌ కావాలని గవర్నర్‌ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు ముదిరాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి సమయంలో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌ను గవర్నర్‌ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.