న్యూఢిల్లీ:మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్‌లను తొలగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటులు చిరంజీవి, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్‌ను బ్లూ చెక్ మార్క్ నుంచి తొలగించారు.ట్విట్టర్ కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు ట్విట్టర్ బ్లూ కోసం చెల్లించే వారికి మాత్రమే బ్లూ టిక్ మార్కులను ఇస్తుంది. ఏప్రిల్ 20 నుంచి పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోని ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగిస్తామని కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు.
బ్లూ టిక్ కావాలంటే నెలనెలా ఛార్జీ చెల్లించాలని స్పష్టం చేశారు. అనుకున్నట్టుగానే అర్థరాత్రి నుంచి చాలా మంది ప్రముఖుల బ్లూటిక్‌ను తొలగించారు. రాబోయే రోజుల్లో లెగసీ వెరిఫైడ్ ఖాతాల నుంచి బ్లూ టిక్‌ను తొలగిస్తామని మార్చి 1 న ట్విట్టర్ ప్రకటించింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, బ్లూ టిక్‌ను తొలగించలేకపోయింది. తరువాత మస్క్ తన ఒక ట్వీట్‌లో “ఏప్రిల్ నుంచి, లెగసీ వెరిఫైడ్ ఖాతాల ముందు ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్‌ను తొలగిస్తుంది” అని చెప్పారు.కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. వారికి మాత్రం బ్లూ టిక్ కంటిన్యూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రి కేటీఆర్, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాన్ రామ్, డైరెక్టర్ రాజమౌళికి బ్లూ టిక్ ఉంది.
రాత్రికి రాత్రే బ్లూ టిక్ తొలగించడంపై సినీనటి, బీజేపీ లీడర్ కుష్బూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా తొలగించడమేంటని ప్రశ్నించారు. తాను సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ ఇంకా రివ్యూడ్ అని చూపిస్తోందని అన్నారు. అమెరికన్ సంగీతకారుడు డోజా కాట్ తన బ్లూ చెక్ మార్క్ను కోల్పోయిన తర్వాత ట్వీట్ చేశారు, “బ్లూ టిక్ను తొలగించడం అంటే మీరు ఓడిపోయారని అర్థం. మీరు ప్రసిద్ధ వ్యక్తుల నుంచి ధృవీకరణ కోసం ఆరాటపడుతున్నారు.” చాలా మంది నెటిజన్లు బై బై బ్లూ టిక్ అంటూ ట్వీట్‌లు చేశారు.బ్లూ టిక్ కోల్పోయిన ప్రముఖులు కొందరు.