National News Networks

ఆర్ధిక పరిస్థితులు చక్కదిద్దకపోతే అధోగతే:ఎంపి రఘు

Post top

యధావిధిగా ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వం తన ఉద్యోగుల కు జీతాలు, వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించాలని కోరుతూ మరోలేఖను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాశారు. ఆ లేఖలో ఇంకా ఏమన్నారంటే
మన రాష్ట్రంలో పని చేస్తున్న 4,43,711 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించే గడువు తేదీ ప్రతి నెలా ఒకటో తేదీ దాటిపోతున్నది. ప్రతి నెలా పదో తేదీ వరకూ వారికి విడతల వారీగా జీతం చెల్లింపులు చేస్తున్నారు. అంతే కాదు, 2,88,480 మంది ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు కూడా వాయిదాలు పడుతూ ఇప్పటికే నెల రోజుల బకాయితో నడుస్తున్నది. రాష్ట్రంలోని 3.5 లక్షల మంది పెన్షనర్లకు అయితే నెలలో మూడో వారం వరకూ చెల్లింపులు జరగడం లేదు. జీతాల చెల్లింపు కోసం రూ.3500 కోట్లు, పెన్షన్ల చెల్లింపు కోసం నెలకు రూ.2500 కోట్లు, ఈ చెల్లింపుల కోసం తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ భారం రూ 3,000 కోట్లు… ఇలా చూస్తే నెలకు రూ.9,000 కోట్లు ప్రభుత్వానికి అవసరం అవుతున్నాయి.
మీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గత రెండేళ్లుగా ఏనాడూ ఆర్ధికంగా బాగాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని తీవ్రమైన వత్తిడిలోకి వచ్చేశాం. మధ్యలో శెలవుల రావడం వల్ల జీతాలు సకాలంలో చెల్లించలేక పోతున్నామని, కరోనా కారణంగా జీతాల చెల్లింపు ఆలశ్యం అవుతున్నదని ఇంతకాలం కుంటి సాకులు చెబుతూ మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చాం. ప్రభుత్వం నుంచి సకాలంలో జీతాలు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిడికి గురి అవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి సూచిస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే ఇంకా కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారే ఉండరేమోననే అనుమానం నాకు కలుగుతున్నది. నిరుద్యోగులలో ఈ భావన కలిగించడానికే ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నదని నేనైతే అనుకోవడం లేదు.
గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరహ:
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీగురవేనమ:
మన దేశంలో ఉపాధ్యాయులను సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపులుగా భావిస్తుంటాం. అలాంటి వారికే మనం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాం. ఈ విధమైన పరిస్థితి నెలకొని ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం 8వ స్థానంలో ఉన్నది. అదే భగవత్ స్వరూపులైన గురువులకు వేతనాలు చెల్లించడంలో ప్రపంచంలోనే 26వ స్థానంలో ఉన్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకు చెల్లించే జీతాలు కూడా బకాయిలు పెడుతున్నామంటే అది ఎంత హీనమైనదో అర్ధం చేసుకోండి. భావితరాలను తీర్చి దిద్దే గురుతర బాధ్యతను నెత్తిన పెట్టుకుని మోసే ఉపాధ్యాయులకు ఈ విధంగా చేయడం మీకు భావ్యం కాదు.
151 అసెంబ్లీ స్థానాలతో అప్రతిహత విజయం సాధించి మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రభుత్వ సిబ్బంది ఎంతో కీలకపాత్ర పోషించిన విషయం మనం మరచిపోకూడదు. ‘‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’’ అన్న చందంగా వ్యవహరిస్తూ వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడం సహించరాని విషయం. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించి ఆ తర్వాతే మిగిలిన ఖర్చులు చూసుకుంటుంది. అయితే మీరు నేరుగా క్యాష్ ఇచ్చే స్కీమ్(నగదు పంపిణీ పధకాలపై) లపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఈ విధంగానే ఖర్చు అయిపోతున్నాయనే భావనలో ప్రజలు ఉన్నారు.
ఎంతో సహృదయంలో గత రెండు సంవత్సరాలుగా జీతాలు సకాలంలో రాకపోయినా సహనంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలానే కలకాలం ఉంటారని మీరు భావిస్తే అది తప్పు అవుతుంది. మనమేదో యూనియన్ నాయకులను మేనేజ్ చేసి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల నోరు మూయించినట్లు ఇక రాబోయే రోజుల్లో కుదరకపోవచ్చు. ఇప్పటికే మీ పోకడలను గమనిస్తున్న వారు కూడా మీ నాయకత్వాన్ని ‘‘ఆపదలో మొక్కులు… సంపదలో మరపులు’’ అనే అనుకుంటున్నారు.
తెలుగులో ‘‘అత్త సొమ్ము అల్లుడు దానం’’ అన్న సామెత చెప్పినట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, గ్రాంట్లు అన్నీకూడా మీ పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నట్లుగా ప్రజలకు ఇప్పటికే అర్ధం అయింది. ఉద్యోగులకు, టీచర్లకు జీతాలు, భత్యాలు ఇవ్వడమనే ప్రాధాన్యతాంశాన్ని మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మరచిపోతున్నారు. గత ఏడాది కాలంగా మీరు ఉద్యోగులకు మెడికల్ రీయంబర్స్ మెంట్ డబ్బులు కూడా చెల్లించడం లేదు. గత రెండు సంవత్సరాలుగా మీరు గృహనిర్మాణ భత్యం (హౌస్ బిల్డింగ్ ఎలెవన్స్- హెచ్ బి ఏ) కు అనుమతులు ఇవ్వడం లేదు. దీని కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం ద్వారా మీరు మీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది…. ‘‘అద్దం అబద్ధం ఆడుతుందా?’’
ప్రభుత్వం కోసం కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు, విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇవ్వకుండా మనం చేస్తున్నది ఏమిటంటే ఆర్భాటంగా హెలికాప్టర్లకు, ప్రత్యేక విమానాలకు అద్దెలు చెల్లించడం. నెలలో ఒక సారో రెండు సార్లో ప్రయాణం చేసేందుకు వినియోగించే హెలికాప్టర్, ప్రత్యేక విమానం అద్దెకు తీసుకోవడం అంత అవసరమా? ఇలా చేయడానికి ఏ లాజిక్ ఉందో అర్ధం కావడం లేదు సరికదా ఇలా చేయడాన్ని ప్రజలు ‘‘నిధుల దుర్వినియోగం’’ అని అంటున్నారు. వీటితోబాటు న్యాయస్థానాలలో మనం గెలుస్తామో లేదో తెలియని, గెలవడానికి ఏ మాత్రం అవకాశం లేని కేసులలో వాదించేందుకు ఎంతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు.
ఆలశ్యం… అమృతం విషం.. ఇప్పటికైనా సత్వరమే స్పందించండి. మీ ప్రాధాన్యతలు మార్చుకోండి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడాన్ని ప్రధమ ప్రాధాన్యంగా పెట్టుకోండి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగులకు చెల్లించాల్సిన భత్యాలను, అడ్వాన్సులను తక్షణమే వడ్డీతో సహా చెల్లించండి. రాష్ట్రానికి రాబడి తెచ్చే విషయాలను ఇప్పటికైనా ఆలోచించండి. కేవలం మీ పేరుతో అమలు చేసుకునే సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు మాత్రమే చేసే విషయాలపై పునరాలోచించండి. ఆర్ధిక క్రమశిక్షణ లేని ఈ స్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా ప్రయత్నించండి. అలా కాకుండా మీరు ఇదే విధమైన పరిస్థితిని కొనసాగిస్తే రాష్ట్రం మరింత ఆర్ధిక సంక్లిష్టతలో చిక్కుకుంటుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.