- అర్ధరాత్రి హోటళ్లు తెరిచి ఉంచడంపై పోలీసుల అభ్యంతరం
- మా ఇష్టం అంటూ వార్నింగ్ ఇచ్చిన కార్పొరేటర్
- కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- చంచల్ గూడ జైలుకు కార్పొరేటర్
హైదరాబాద్ భోలక్ పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ నగర పోలీసులపై వీరంగం వేయడం తెలిసిందే. ముషీరాబాద్ లో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై ఎంఐఎంకు చెందిన గౌసుద్దీన్ మహ్మద్ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయాడు. రాత్రివేళల్లోనూ హోటళ్లు, దుకాణాలు తెరిచే ఉంచుతాం… రంజాన్ సీజన్ అంతా ఇలాగే చేస్తాం… ఏంచేస్తారో చేసుకోండి అంటూ గౌసుద్దీన్ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇలాంటి జులుం నడవదంటూ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో, ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో ఆ కార్పొరేటర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అంతకుముందు, కార్పొరేటర్ గౌసుద్దీన్ స్పందిస్తూ, పోలీసులు అభ్యంతరకర పదజాలం వాడడం వల్లే తాను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. గతంలో తానెప్పుడూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ముషీరాబాద్ ప్రాంతంలో పోలీసులు, అధికారులతో తానెంతో సన్నిహితంగా ఉంటానని తెలిపారు.