- కేంద్రం చేతిలో వేటకుక్కలుగా ఈడీ, సీబీఐ
- రాష్ట్రంలో ప్రజలు మావైపే.. ప్రత్యర్థులే పెరిగారు
- కుల, మత విద్వేషాలకు తెలంగాణలో తావులేదు
- ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాంధీ మాటలు మాట్లాడుతూ, గాడ్సే పనులు చేస్తున్నారని ఐటీ, పురపాలక, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, సీబీఐని వేటకుక్కల మాదిరిగా ఉసిగొల్పుతున్నారని, జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం పలు మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని ఒకరు, మొత్తం మోదీ ప్రభుత్వమే ఇస్తున్నదని మరొకరు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవ్వాళ దేశానికే తెలంగాణ ఇస్తున్నది తప్ప.. తెలంగాణకు ఇచ్చింది ఏమీలేదని లెక్కలతో సహా చెప్తున్నామని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65 లక్షల కోట్లు వెళ్తే, కేంద్రం నుంచి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని, మిగతా సొమ్ము ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
దేశానికి అన్నంపెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉన్నదని స్వయంగా ఆర్‌బీఐ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కుల, మతాల పేరుతో రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణలో ఇలాంటివాటికి తావులేదని స్పష్టంచేశారు. గోల్‌మాల్ తెలంగాణ కావాలో.. గోల్డెన్ తెలంగాణ కావాలో ప్రజలకు స్పష్టత ఉన్నదని చెప్పారు. బీజేపీ చెప్తున్నట్టు కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నదని, అక్కడ ఏ గ్రామంలోనైనా డంప్ యార్డు, వైకుంఠధామం, ఇంటింటికి నల్లా కనెక్షన్, రైతుబంధు, రైతు బీమా వంటివి అమలైనట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు.
మేం మద్దతు ఇస్తే.. మాకు ద్రోహం చేశారు
కొత్త రాష్ట్రం కావడంతో తెలంగాణ ఏడేండ్లపాటు కేంద్రానికి మద్దతు ఇచ్చిందని, జీఎస్టీ బిల్లు, డీమానిటైజేషన్, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయినా కేంద్రం తెలంగాణకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ‘విభజన హామీలు నెరవేర్చలేదు. నవోదయ విద్యాసంస్థలు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినా రూ.24 వేల కోట్లు ఇవ్వలేదు. తెలంగాణ మీద ఎందుకింత కక్ష, ఏడుపు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్థి అని తెలిపారు. ఈ సారి కూడా కచ్చితంగా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
తెలంగాణలో ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, ప్రత్యర్థులే పెరిగారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో కేఏ పాల్ అయిపోయారని ప్రజలు జోకులేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలను రేపు ఏం వారం.. ఎల్లుండి ఏ వారం? అని అడుగుతున్నారు. దానికి బదులు రేపు ఏం తిందాం? ఎల్లుండి ఏం జాబ్ తెద్దాం అని ఆలోచించాలి’ అని సూచించారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వంటివాళ్లు సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని స్పష్టంచేశారు.
పెంచిన సన్నాసే తగ్గించాలి
2014లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105 డాలర్లు ఉంటే ఇప్పుడూ అంతే ఉన్నదని, పెట్రోల్, డీజిల్ ధర మాత్రం అప్పుడు రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.120 అయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటివరకు వ్యాట్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. ‘ఏ సన్నాసి నిర్వాకం వల్ల పెట్రోల్..డీజీల్ ధరలు పెరిగాయో.. ధరలు వారే తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు. బీజేపీవాళ్లకు జై శ్రీరాం అనే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు. భద్రాచలంలో ఉన్న రాముని గుడికి బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి రాముడు రాముడు కాదా? అయోధ్య రాముడే రాముడా? అని నిలదీశారు.
వేటకుక్కల్లా ఈడీ..సీబీఐలు
దేశంలో బీజేపీ నేతలంతా సత్య హరిశ్చంద్రులు, సాధువులు అన్నట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నరేంద్రమోదీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈడీ, సీబీఐలను వేటకుక్కల మాదిరిగా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌పై కేసులు పెట్టారని, బీజేపీలో చేరగానే ఏమైపోయాయని నిలదీశారు.
నరేంద్రమోదీ గాంధీ మాటలు చెప్తూ.. గాడ్సే పనులు చేస్తారని ధ్వజమెత్తారు. జాతిపితను చంపిన వాడిని కీర్తించే ఎంపీలను ఒక్క మాటైనా అన్నారా? అని ప్రశ్నించారు. అదే మాట జిగ్నేశ్ మేవానీ అన్నందుకు అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. మోదీ గాడ్సె భక్తుడని తాను అంటున్నానని, ఇందుకు తనను జైల్లో పెడతారా? అని సవాల్ చేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారని, కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, జ్యోతిరాధిత్య సింధియాలవి కుటుంబ రాజకీయాలు కాదా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి కోసమే అప్పులు
రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని, వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉంటే, ఇప్పుడు రూ.2.78 లక్షలకు పెరుగడం, జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్ల నుంచి రూ.11.58 లక్షల కోట్లకు పెరుగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశంలో తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్నా.. ఆర్థికంగా 4వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
‘ఉత్పాదక రంగంలో అప్పు ఖర్చుపెడితే పెట్టుబడిగా మారుతుంది. దానిని అప్పుగా చూడొద్దు. తెలంగాణలో కరెంట్ బాగు చేయటానికి అప్పులతో కలిపి రూ.85 వేల కోట్లు ఖర్చుచేశాం. ఫలితంగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్తు అందుతున్నది. పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయి. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. దీంతో సంపద పెరిగింది. మిషన్ భగీరథ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చుచేశాం. దాని వల్ల ప్రజలకు వ్యాధులు తగ్గాయి. ఇది లాభమా? నష్టమా?’ అని ప్రశ్నించారు.