ఖమ్మం, ఏప్రిల్ 15:మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ టికెట్ దగ్గర నుంచి తనకు అనేక అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలు చెప్పడం వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ పని అని, మాటలు చెప్తే మూడోసారి కూడా ప్రజలు ఓటు వేస్తారని సీఎం నమ్ముతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న వారిలో ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేశారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోనప్పుడు.. మీకు అండగా నేనున్నానని, అందరినీ ఆదుకున్నానని చెప్పారు. అధికార మదంతో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు విర్రవీగే సమయం అయిపోయిందని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు.
తాను మాటల మనిషిని కాదని.. అందరూ ఒకే గూటికి రావాలని తాను అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని పిలుపునిచ్చారు. తాను మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలిచి.. రామరాజ్యం ఇస్తానని హామీ ఇచ్చారు.ఇదిలావుండగా.. కొన్నిరోజుల క్రితం వైఎస్ విజయమ్మను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడంతో, ఆయన షర్మిల పార్టీలో చేరుతారనే ప్రచారం మొదలైంది. అయితే.. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చేశారు. తాను వైఎస్ఆర్‌టీపీ పార్టీలో చేరడం లేదని, షర్మిల పార్టీలో మొహమాటానికి చేరి తన గొంతు తాను కోసుకోలేనని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని.. కానీ తాను ఏ లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో, ఆ లక్ష్యం ఉన్న పార్టీలో చేరుతానని తెలిపారు.
దీంతో.. పొంగులేటి ఏ పార్టీలో చేరుతారు? అనే విషయం మళ్లీ మిస్టరీగా మారింది. నిజానికి.. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి బయటకు వచ్చిన మొదట్లోనే ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అమిత్ షాతో భేటీ అయిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ.. 2 నెలలు గడిచినా, ఆయన బీజేపీలో చేరికపై క్లారిటీ రాలేదు. బీజేపీ మాత్రం ఆయన్ను తమ పార్టీలో చేర్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.