National News Networks

ప్రగతి చిహ్నం.. 100కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Post top
  • మహా నగరంలో లింకు రోడ్లు, స్టీల్‌ బ్రిడ్జిలు
  • ఒకే రోజు రూ.100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు
  • లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్‌ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చెరువులనూ సుందరీకరిస్తున్నది. ఇందులోభాగంగానే సోమవారం గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి..రూ. 100కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. వాటిలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 51 సైలెంట్‌ వ్యాలీ వద్ద నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి, ఓల్డ్‌ బాంబే హైవే నుంచి ఖాజాగూడ, ఖాజాగూడ లేక్‌ టు ఉర్దూ వర్సిటీ కంపౌండ్‌ వాల్‌ వరకు నిర్మించిన లింకు రోడ్లు, అందంగా తీర్చిదిద్దిన మల్కంచెరువు ఉన్నాయి.

చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడు చిన్నచిన్న ప్రయోగాలు చేసేవాడిని. బల్బుల్లో ఫిలమెంట్‌ తీసేసి నీళ్లు పోసి.. రకరకాల కలర్లు వేసి రిఫ్లెక్ట్‌ చేసే వాళ్లం. నేటి పిల్లలు కూడా కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామం.
–తారామతి బారాదరిలో స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం గ్రేటర్‌లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.100 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం:45పై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా రోడ్‌ నం:51 సైలెంట్‌ వ్యాలీ వద్ద రూ.30.30 కోట్లతో కిలో మీటరున్నర మేర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రులు మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ఓల్డ్‌ బాంబే హైవే నుంచి ఖాజాగూడ వరకు నిర్మించిన లింకు రోడ్డు, అభివృద్ధి చేసిన మల్కం చెరువును, ఖాజాగూడ లేక్‌ నుంచి ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఉర్దూ యూనివర్సిటీ కంపౌండ్‌ వాల్‌ వరకు నిర్మించిన లింకు రోడ్డును ప్రారంభించారు. పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్వింద్‌ కుమార్‌, గచ్చిబౌలి కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి, కార్పొరేటర్లు జగదీశ్వర్‌ గౌడ్‌, హమీద్‌ పటేల్‌, మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్టీల్‌ బ్రిడ్జి రాకతో సాఫీగా ప్రయాణం

ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ నగరంలో మరోచోట స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం:51లో ప్రయాణానికి అనువుగా ఉండేందుకు గానూ రూ.30.30 కోట్లతో జూబ్లీహిల్స్‌ సైలెంట్‌ వ్యాలీ వద్దను ఈ బ్రిడ్జిని నిర్మించారు. 350 మీటర్ల పొడవు, 17.50 కిలో మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లతో ఈ నిర్మాణం చేపట్టారు. షేక్‌పేట నుంచి రోడ్‌ నం:45కు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రవాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జితో 3.5 కి.మీల దూర భారం తగ్గనుంది. సైలెంట్‌ వ్యాలీ వద్ద పెద్ద గుట్టలున్న ప్రాంతం అది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణం కష్టతరంగా మారింది. కాగా, రోడ్డు నం: 51 నుంచి రాయదుర్గం ఓల్డ్‌ బాంబే హైవే వరకు అనుసంధాన (లింకు) రోడ్డు నిర్మించారు. ఎగుడు-దిగుడును తప్పిస్తూ సులువైన ప్రయాణానికి ఈ స్టీల్‌ బ్రిడ్జితో మార్గం సుగమమం చేశారు.

సర్వాంగ సుందరంగా మల్కం చెరువు
శేరిలింగంపల్లి మండపల పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు 51.30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఓల్డ్‌ బాంబే హైవే వెంబడి ఉండటంతో ఈ చెరువును మినీ ట్యాంకు బండ్‌లా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అపర్ణ ఇన్‌ఫ్రా హౌజింగ్‌ ప్రై.లి. సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించి చెరువును సుందరీకరించేందుకు ముందుకు వచ్చింది. చెరువులో పూడిక తీత పనులు చేపట్టారు. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ మార్గాలను అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ గ్రిల్స్‌ వేసి ఉంచారు. ల్యాండ్‌ స్కేప్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, ఓపెన్‌ జిమ్‌, అంఫీ థియేటర్‌, సైక్లింగ్‌, జాగింగ్‌ ట్రాక్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తదితర వసతులను కల్పించారు. మినీ పర్యాటక క్షేత్రంగా మల్కం చెరువును తీర్చిదిద్దారు. దాదాపు రూ.30 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశారు.

అందుబాటులోకి లింకు రోడ్లు…
– మిస్సింగ్‌ లింకు కారిడార్‌ 32లో భాగంగా ఓల్డ్‌ బాంబే హైవే నుంచి ఖాజా గూడ వరకు వయా మల్కం చెరువు, చిత్రపురి కాలనీ మీదుగా 950 మీటర్ల మేర నూతన రహదారిని నిర్మించారు. నాలుగు లేన్లతో మూడు మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు.

– మిస్సింగ్‌ లింక్‌ కారిడార్‌ 27లో భాగంగా ఖాజాగూడ లేక్‌ నుంచి ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఉర్దూ యూనివర్సిటీ కంపౌండ్‌ వాల్‌కు అనుకుని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌ వరకు రహదారిని నిర్మించారు. 2.20 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్లతో ఈ రహదారిని ఏర్పాటు చేశారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.