హైదరాబాద్, అక్టోబర్ 23: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ బీజేపీ – జనసేన మధ్య పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తు ఉంటుందని ఇరువర్గాలు అంటున్నాయి. కానీ అధికారికంగా ఎవరూ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇది వ్యూహాత్మకమా? లేదంటే ఎవరి దారి వారిదే అన్న సంకేతమా? అన్నది అంతుపట్టడం లేదు. ఎన్నికల వేళ పొత్తుపై సందిగ్దత రెండు పార్టీల కేడర్‌ని అయోమయంలో పడేస్తోంది. తెలంగాణలో అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది బీజేపీ. ఏ చిన్న అవకాశం వచ్చినా ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జనసేనను కలుపుకుని వెళ్లాలన్న ఆలోచనతో ఉంది. అయితే పొత్తుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొత్తుకి ఓకే అని చెబుతున్నప్పటికీ ఇరు పార్టీలు ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎవరికి వారు తోచినన్ని సీట్లు ప్రకటించుకున్నారు. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. బీజేపీ ప్రకటించిన 52మందితో కూడిన జాబితాలో.. పది స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. జనసేన లిస్ట్ తెలిసి కూడా ఎందుకు ఆ పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిందన్నది సస్పెన్స్‌గా మారింది.