Gangadharao karam Updated on:july 09,2023-5:40 PM
ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణా చత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ రాజస్ధాన్ మిజోరంకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో చత్తీస్ గఢ్ రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లో కూడా 2018లో కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది కానీ స్వయంకృతం వల్ల అధికారాన్ని పోగొట్టుకుంది. కాంగ్రెస్ లోని అసంతృప్త వర్గాన్ని తెరవెనుక నుండి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చింది.
ఇక మిజోరం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపధ్యంలోనే ప్రీ పోల్ సర్వే సంస్ధలు ఉత్సాహంగా రంగంలోకి దిగేశాయి. ఇందులో భాగంగానే చత్తీస్ గఢ్ లో పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్ధ సర్వే నిర్వహించింది. ఇందులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తేలిందట. మొత్తం 90 నియోజకవర్గాలుంటే ఇందులో 60 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సర్వేలో తేలింది.

అధికార పార్టీలో ఏవో చిన్న చిన్న ఆధిపత్య గొడవలే తప్ప చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవటమే పెద్ద ప్లస్సయినట్లుంది. ఇదే సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం చత్తీస్ గఢ్ లో కూడా ప్రభావం చూపినట్లుంది. చత్తీస్ గఢ్ అంటేనే ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమని తెలిసిపోతోంది. ఇక్కడ ఎస్టీల్లో మెజారిటి వర్గాలు హస్తంపార్టీకే మద్దతుగా నిలుస్తున్నారట. రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలోని 12 సీట్లూ ఇపుడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా మెజారిటి మాత్రం కాంగ్రెస్ దేనట.
సుక్మా జిల్లాలో 2018తో పోలిస్తే బీజేపీ బలపడినట్లు అనిపిస్తున్నా మెజారిటీ సీట్లు మాత్రం హస్తం పార్టీదేనట. రాయపూర్ జగదల్ పూర్ బిలాస్ పూర్ అంబికాపూర్ కోబ్రా రాయగఢ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మెజారిటి తప్పదట. ఇక్కడ రాజపుత్ బనియా బ్రాహ్మిణ్ సింథీ పంజాబి మార్వాడీ సామాజికవర్గాల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఓడీసీల్లో కుర్మీలు రెండో అతిపెద్ద సామాజికవర్గం. ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుర్మీ సామాజికవర్గమే కాబట్టి వీళ్ళంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు అభివృద్ధి వల్లే రెండోసారి అధికారం దక్కే అవకాశాలున్నట్లు సర్వేలో తేలిందట.