National News Networks

బిజెపి గూటికి అవినీతి నేతల క్యూ..

Post top
కేసులన్ని గాలికి.. పార్టీలో చేర్చుకుంటూ పదవులు.
written
by-SRD KARAM
బిజెపి ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా ‘ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు..
‘దేశంలో తమ పార్టీలో ఉండే నాయకులు తప్పితే మిగతావారంతా అవినీతిపరులే.ఇతర పార్టీల్లో ఉండే అవినీతిపరులెవరైనా తమ పార్టీలో చేరితే మాత్రం వారు సచ్ఛీలురు’ ఇది బిజెపి అనుసరిస్తున్న తీరు.
నాయకులెవరైనా,వారిపై ఉన్న అవినీతి ఆరోపణ లతో ఏ మాత్రమూ సంబంధం లేకుండా వారిని పార్టీలో చేర్చుకొని ప్రభుత్వపరంగా,పార్టీ పరంగా పదవులు కట్టబెడుతున్నది. ప్రజాప్రయోజనాలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నది..
ఇటీవల మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ‘మేరా బూత్‌ సబ్‌సే స్ట్రాంగ్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాశ్మీర్‌ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న రాజకీయ పార్టీల కుటుంబ వారసత్వ రాజకీయాలు,వారి అవినీతి రాజకీయాల గురించి ఈ కార్యక్రమంలో మోడీ ప్రస్తావించారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షం, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీల వరకు.. ప్రతి ప్రధాన పార్టీనీ ఆయన టార్గెట్‌ చేశారు.
ఈ పార్టీల నాయకులు తాము చేసిన అవినీతికి సంబంధించి కటకటాల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ప్రతిపక్షాల ఐక్యత పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని పాట్నాలో ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశాన్ని ఉటంకిస్తూ మోడీ అన్నారు.
అయితే, మోడీ వ్యాఖ్యలు చేసిన రెండు, మూడు రోజులకే మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించకమానవు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సిపి నాయకులు మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వంలో చేరి పదవులు పొందారు. అజిత్‌ పవార్‌తో పాటు 8 మంది జంపింగ్‌ ఎమ్మెల్యేలను కూడా ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు.
వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఛగన్‌ భుజబల్‌, హసన్‌ ముష్రిఫ్‌, అదితి తత్కరేలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులూ వారిపై జరిగాయి.
మనీలాండరింగ్‌ కేసులో ఛగన్‌ భుజ్‌బల్‌ ఇప్పటికే రెండేండ్ల జైలు జీవితం అనుభవించాడు.అతనిపై ఇతర అవినీతికి సంబంధించిన కేసులు కోర్టులలో పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
హసన్‌ ముష్రిఫ్‌ కూడా ఈడీ టార్గెట్‌లో ఉన్నారు. గతంలో ఈడీ దాడులు జరపటంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బినామీ ఆస్తుల సాయంతో ముష్రీఫ్‌ రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలే ఆరోపించటం గమనార్హం.
అలాగే తత్కరే కుమార్తె అదితి తట్కరే కూడా ఇటీవలి ఫిరాయింపుల్లో పాల్గొన్నది. నీటిపారుదల కుంభకోణంలో సునీల్‌ కూడా ఈడీ టార్గెట్‌లో ఉన్నాడు.
ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో పదే పదే ఇదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీ ఒకవైపు విపక్షాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రసంగాలు చేస్తూనే మరోవైపు అదే అవినీతి నాయకులను అధికారంకోసం పార్టీలో చేర్చుకుంటున్నారు.
ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి కీలకంగా వ్యవహరిస్తున్న హిమంత విశ్వ శర్మను సైతం ఆయన అవినీతిని ఆయుధంగా వాడుకొని కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి తీసుకొచ్చి మంత్రి,ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టిన సంగతి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలు రోజ్‌వ్యాలీ స్కామ్‌, శారదా స్కామ్‌, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌, బొగ్గు అక్రమ రవాణా స్కామ్‌లను ఎన్నటికీ మర్చిపోరు. అయితే, ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లోని ముఖ్య నాయకులైన సువేందు అధికారి, ముకుల్‌ రాయ్, సోవన్‌ ఛటర్జీ, జితేంద్ర తివారీలను బీజేపీలో చేర్చు కొని బీజేపీ రాజకీయంగా లబ్దిపొందింది. వారిపై ఆరోపణలను మానేసింది. కేంద్ర సంస్థలతో వేధింపులను ఆపేసింది.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పపై తీవ్రఅవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకుని వెంటనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.ఈ ఆరోపణలు కూడా ఆయన బిజెపి వీడి సొంత పార్టీ పెట్టడానికి కారణమయ్యాయి. భూ,మైనింగ్‌ కుంభకోణాల్లో పలుసార్లు జైలుకెళ్లిన యడియూరప్పకు మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి తారు మారు రాజకీయాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. కర్నాటకలోని బళ్లారి రెడ్డి సోదరులనూ బిజెపి పెంచి పోషించిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు.
ఇలా అవినీతిపరులు, మోసగాళ్లను పార్టీలోకి తీసుకు రావడం ద్వారా వారికి రక్షణ కల్పించాలన్న బిజెపి విధానాన్ని దేశంలోని ప్రతి మూలన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు బీజేపీ పార్టీ అవినీతిపై తాను చేసే వ్యాఖ్యలను పాటించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇటు బీజేపీ చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలపై నెటిజన్లు తమదైన రీతిలో సెటైర్లు వేస్తున్నారు. బిజెపిలో చేరితే అవినీతి మరకలు తొలగిపోతాయని ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.