నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో ఎవరు బాగుపడ్డారు
ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
చండీఘఢ్ ఫిబ్రవరి 15: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో ఎవరు బాగుపడ్డారని రాహుల్ నిలదీశారు. ప్రతి సభలో తాను పేదల బ్యాంకు ఖాతాల్లో రూ 15 లక్షలు జమ చేస్తానని, రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని మోదీ చెబుతున్నారని, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. పంజాబ్ రైతుల కష్టాన్ని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లకు దోచిపెట్టాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని దుయ్యబట్టారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో మరణించిన అన్నదాతలకు ప్రధాని పార్లమెంట్‌లో కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించలేదని, మరణించిన రైతులకు పరిహారం చెల్లించలేదని దుయ్యబట్టారు. కేంద్రం చేయలేని పనులను రాజస్ధాన్, పంజాబ్ ప్రభుత్వాలు చేసి చూపాయని రాహుల్ వివరించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్‌కు పీఎం భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ హోషీయాపూర్‌కు ఇవాళ వెళ్లాల్సి ఉంది. కానీ మోదీ జలంధర్‌లో ఎన్నికల ర్యాలీలో పర్యటిస్తున్న సందర్భంగా చండీఘర్‌లోని రాజేంద్ర పార్కు ఏరియాను నో ఫ్లై జోన్‌గా ప్రకటించామని పీఎం భద్రతా సిబ్బంది తెలిపారు.
ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం హెలికాప్టర్‌కు అనుమతివ్వలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇక పంజాబ్‌లో ఈనెల 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని ఆప్ పావులు కదుపుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు అకాలీదళ్, బీజేపీ-పీఎల్‌సీ కూటమి చెమటోడుస్తున్నాయి.