National News Networks

డీఎల్ దారెటు… ?

Post top

కడప, ఫిబ్రవరి 9: మూడేళ్లు మౌనంగా ఉన్న నేత ఒక్కసారి పెదవి విప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆయన త్వరలోనే టీడీపీ లో చేరతారని భావించారు. కానీ టీడీపీ నుంచి కూడా ఆయనకు డోర్లు ఓపెన్ కాలేదని సమాచారం. ఆయనే రాయలసీమలో సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. ఆయన మూడు నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. వైసీపీ మైదుకూరులో గెలుస్తుందా? అని సవాల్ విసిరారు కూడా.కానీ ఈ సవాళ్లు విసిరి దాదాపు మూడు నెలలు కావస్తుంది. డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం మరోసారి మౌనాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించడం లేదు. దీనికి కారణం ఆయన కు దారి కన్పించకపోవడమే. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తాను టీడీపీలో చేరాలని భావించారు. టీడీపీలో చేరినా తనకు మైదుకూరు టిక్కెట్ ఇస్తేనే చేరాలన్న షరతు విధించాలని అనుకున్నారు.

ఈ మేరకు డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు సమాచారం పంపినట్లు తెలిసింది. తాను పార్టీలో చేరితే కేవలం మైదుకూరు మాత్రమే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని కూడా చెప్పారట. అయితే కడప జల్లా టీడీపీ నేతలే డీఎల్ రవీంద్రారెడ్డి రాకను అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మైదుకూరులో ప్రస్తుతం పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఈసారి టిక్కెట్ తనదేనన్న ధీమాగా ఉన్నారు. మూడేళ్ల నుంచి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. దీంతో టీడీపీ అధినాయకత్వం నుంచి డీఎల్ రవీంద్రారెడ్డికి సానుకూలమైన కబురు అందలేదట.

ముందు పార్టీలో చేరారని, టిక్కెట్ విషయం తర్వాత ఆలోచిస్తామని చెప్పడంతో డీఎల్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. తన సన్నిహితులతో మంతనాలు జరిపిన డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. కానీ అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన మరోసారి మౌనాన్ని ఆశ్రయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఆయన స్పందించలేదు. డీఎల్ కు ఇక మరో దారి కన్పించడంలేదట.

Post Midle
Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.