National News Networks

0.2 గాళ్లకు నాలుగు మంత్రి పదవులు: ఈటల

Post top

హైదరాబాద్: తెలంగాణలో 0.2 శాతం కూడా లేని వెలమ కులానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చి, దళితులకు ఒక్క మంత్రి పదవి ఇచ్చారని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈటల రాజేందర్ బిజెపి నాయకులు ఏపి.జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ తన ఏడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క బిసి, ఎస్సి, ఎస్టి అధికారిని కూడా నియమించుకోకుండా తన అగ్రకుల నైజాన్ని చూపించారన్నారు. 0.2 శాతం ఉన్న మీకులానికి నాలుగు మంత్రి పదవులు, 15 శాతం జనాభా ఉన్న ఎస్సి లకు ఒకే ఒక మంత్రి పదవా? అని నిలదీశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు, దళితుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రారంభించిన దళిత బంధు పథకంపై సిఎం కెసిఆర్ బృందంతో చర్చించేందుకు తాను సిద్ధమని ఈటల సవాల్ విసిరారు. కేవలం దళితుల ఓట్లమీద ప్రేమతో కోకాపేటలో అమ్మిన ప్రభుత్వ భూముల ద్వారా వచ్చిన పైసలను ఇక్కడ ఖర్చు చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, కరెంట్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, కెసిఆర్ కిట్స్ కోసం మరో రూ.35 వేల కోట్లు కావాలి. మరి మన ఆదాయమెంత? ఇవన్నీ పోనూ మిగిలేదెంత?. దళిత బంధుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు. ఖజానా డబ్బులో లేకుండా.. మీరు ఎలా ప్రకటనలు చేస్తున్నారు?. 8 ఏళ్లుగా గుర్తురాని దళితజాతి మీద మీకు హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసునని రాజేందర్ చురక అంటించారు.

తన జీవితకాలంలో ఏనాడు కెసిఆర్ జై భీమ్ అనలేదని, అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు దండ వేసి దండం పెట్టలేదన్నారు. ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ, ఐపిఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దళిత ఐఏఎస్ అధికారి కె.ప్రదీప్ చంద్ర ప్రధాన కార్యదర్శిగా నెలరోజులే పనిచేశారని, ఆయన పదవీకాలం పొడిగించేందుకు కెసిఆర్ ప్రయత్నించలేదన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత కెసిఆర్ ఆయన సన్మాన సమావేశానికి రాకుండా అప్పటి డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని పంపించారన్నారు. పదవీ వీడ్కోలు సమావేశానికి రానని ప్రదీప్ చంద్ర బెట్టు చేస్తే, కడియం శ్రీహరి బతిమలాడి తీసుకువచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ పదవీ విరమణ చేస్తే కెసిఆర్ హాజరై, దళితుడు ప్రదీప్ చంద్ర పదవీ విరమణ చేస్తే మొఖం చాటేశారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న వారిని పోలీసులు బెదిరిస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కెసిఆర్ పిచ్చిపనులు చేస్తే సహించేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం, ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజలను కలిసే అవకాశం ఉండేదని కెసిఆర్ అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ రద్దు చేసారు. ఏ ముఖ్యమంత్రైనా సెక్రెటేరియట్ కు వచ్చి మీటింగ్ పెట్టే సంస్కృతి ఉండేదని, కానీ ఈయన మాత్రం సెక్రెటేరియట్ కు పదిసార్లకు మించి రాలేదన్నారు. ఇండియా టుడే మ్యాగజైన్ సర్వేలో ఆయనకిచ్చిన స్థానం చూసైనా పరిస్థితి అర్థం చేసుకోవాలని ఈటల ప్రజలకు పిలుపునిచ్చారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.