National News Networks

ఆ మంత్రం మ‌రువొద్దు.. అప్‌డేట్ కావాలి: మంత్రి కేటీఆర్

Post top

హైద‌రాబాద్ : ప్ర‌తి విద్యార్థి, టీచ‌ర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మ‌రిచిపోకూడద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలి. అప్ స్కీల్, రీస్కిల్ చేసుకోక‌పోతే వెనుక‌బ‌డిపోతామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

గోల్కొండ ప‌రిధిలోని తారామతి భార‌ద‌రి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ ఛాలెంజ్ 2021-22 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను మంత్రులు ప‌రిశీలించారు. విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క‌రోనా త‌ర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యాశాఖ నేతృత్వంలో, ఐటీ శాఖ స‌హ‌కారంతో చేసిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు పాఠ‌శాల‌ల విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు 5,387 స్కూల్స్ రిజిస్ట‌రేష‌న్ చేసుకున్నాయి. 7,003 టీచ‌ర్లు విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. 25,166 విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 11,037 టీమ్స్ త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను పంచుకున్నాయి. 79 టీమ్స్ షార్ట్ లిస్ట్ లో చేరాయి. 20 టీమ్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నాయి. జ్యూరీ ద్వారా ఎంపిక కాబ‌డ్డ ఐదు టీమ్స్‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేసిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.

చిన్న‌ పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క‌త అధికంగా ఉంటుంది. చాలా ప్ర‌యోగాలు చేస్తుంటారు. వేస‌వి సెల‌వుల్లో మా అమ్మ‌మ్మ ఊరికి వెళ్లిన‌ప్పుడు.. చిన్న చిన్న ప్ర‌యోగాలు చేసేవాళ్లం. చిన్న చిన్న బ‌ల్బుల్లో ఫిల‌మెంట్ తీసేసి, నీళ్లు పోసి, ర‌క‌ర‌కాల క‌ల‌ర్లు వేసి రిఫ్లెక్టింగ్ చేసేవాళ్లం. ఆ మాదిరిగానే చాలా మంది చిన్న పిల్ల‌లు ప్ర‌యోగాలు చేసి, అందులో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుక‌త‌తో ముందుకు వెళ్తుంటార‌ని కేటీఆర్ తెలిపారు.

జపాన్ పిల్ల‌ల‌ను అభినందించాలి..

మూడు నాలుగేండ్ల కింద జ‌పాన్‌లోని సుజుకి కంపెనీ హెడ్ క్వార్ట‌ర్స్‌కు వెళ్లాం. సుజుకి మ్యూజియం చూపించారు. అక్క‌డ తిరుగుతుంటే.. మొద‌టి బైక్ త‌యారీ వివ‌రాలు క‌నిపించాయి. అవ‌న్నీ చూసుకుంటూ వ‌స్తున్నాం. రెండు, మూడు త‌ర‌గ‌తుల‌కు చెందిన‌ 30 నుంచి 40 మంది స్కూల్ పిల్ల‌లు ఆ మ్యూజియంలో తిరుగుతున్నారు. వారంద‌ర్నీ అక్క‌డి తిప్పి చూపిస్తున్నారు. ఆ పిల్ల‌లు ఏం పరిశీలిస్తున్నారో అర్థం కాక అక్క‌డ‌ ప‌ని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ను అడిగాను. గ‌మ‌నించాల‌ని వారు సూచించారు. వెండింగ్ మిషిన్స్‌ను పిల్ల‌లు ప‌రిశీలిస్తున్నారు. ఒక వ‌స్తువు త‌యారీకి సంబంధించిన వివ‌రాల‌ను చూపిస్తున్నారు. నాకు చాలా ఆశ్చ‌ర్య‌మేసింది. ఆ దేశంలో భూకంపాలు, సునామీలు ఉంటాయి. ప్ర‌కృతి అనుకూల‌త‌లు లేవు. స‌రిగా నీళ్లు ఉండ‌వు. ఇవ‌న్నీ లేకున్న‌ప్ప‌టికీ వారికి బ్రెయిన్ ప‌వ‌ర్ ఉంది. ఆసియా ఖండంలోనే ఒక శ‌క్తిగా, ఆర్థికంగా ఎదిగారు. జ‌పాన్ పిల్ల‌ల‌కున్న సృజ‌నాత్మ‌కత‌ను అభినందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

బియ్యం, పాలు ఎక్క‌డ్నుంచో వ‌స్తాయో తెలియ‌దు..

మ‌న పిల్ల‌ల‌కు బియ్యం ఎక్క‌డ్నుంచో వ‌స్తాయో తెలియ‌దు. పాల ఉత్ప‌త్తి కూడా తెలియ‌దు. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు వారిని డాక్ట‌ర్, ఇంజినీర్ అవుతావా? అని అడిగి మూస ధోర‌ణిలో వెళ్తారు. స‌హ‌జంగా ఉండే తెలివికి ప‌దును పెడితే.. మీరు ఒకరి ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం కాదు.. మీరే వంద‌ల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. అందుకే తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ చాలెంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. పిల్ల‌ల‌కు ఇష్ట‌మున్న కోర్సుల‌ను చ‌దివించాలని కేటీఆర్ సూచించారు.

ఇన్నోవేష‌న్‌కు పెద్ద‌పీట

ఇన్నోవేష‌న్‌కు పెద్ద‌పీట వేస్తున్నాం. రూర‌ల్, సోష‌ల్ ఇన్నోవేట‌ర్లు ముందుకు రావాలి. టెక్నాల‌జీకి సంబంధించి టీ హ‌బ్ ఏర్పాటు చేశాం. హార్డ్ వేర్‌కు సంబంధించి టీ వ‌ర్క్స్ ఏర్పాటు చేసుకున్నాం. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం వీహ‌బ్ అందుబాటులోకి తెచ్చాం. ఇన్నోవేష‌న్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇండ‌స్ట్రీని, సైంటిఫిక్ ల్యాబ్‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చేందుకు రిచ్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

కొత్త‌గా యూత్ హ‌బ్

కొత్త‌గా యూత్ హ‌బ్ ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యూత్ హ‌బ్‌ను రూ. 6 కోట్ల ఫండ్‌తో ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు రోల్ మోడ‌ల్‌గా నిలుస్తున్నాయి. టీచ‌ర్ ఇన్నోవేష‌న్ పోర్ట‌ల్‌ను ప్రారంభించుకున్నాం. మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మం కింద 12 ర‌కాల అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టాం. అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు, ఫ‌ర్నీచ‌ర్, డిజిట‌ల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ ఇవ్వ‌బోతున్నాం. క‌రోనా స‌మ‌యంలో త‌లెత్తిన‌ ఇబ్బందులు భ‌విష్య‌త్‌లో రాకుండా అత్యుత్త‌మ బోధ‌న అందించేందుకు డిజిట‌ల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మ‌న ఊరు మ‌న బ‌డి దేశానికే ఆద‌ర్శంగా నిల‌వ‌బోతుంద‌న్నారు. కొత్త పోక‌డ‌లు పోతున్న విద్యా వ్య‌వ‌స్థ ప‌ట్ల టీచ‌ర్ల‌కు కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేటీఆర్ సూచించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.