హైదరాబాద్, ఏప్రిల్ 20:తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. ఈ సారి రాష్ట్ర సిలబస్ గల పాఠ్యపుస్తకాల ధరలు పెరగనున్నాయి. కాగితం మందం పెరగడంతో పాటు పేపర్ ధరలను పెంచడం వల్ల, తల్లిదండ్రులు గత ఏడాదితో పోల్చితే రాబోయే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల కోసం కనీసం 30 శాతం నుంచి 35 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్రంలో దాదాపు 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో.. 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలకు 1.22 కోట్లకు పైగా సేల్ కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలు అవసరం అవుతాయి.
వీటిని మే 1 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.“గత సంవత్సరం రూ. 55 ధర ఉన్న ఒక్కో సేల్ కాంపోనెంట్ పాఠ్యపుస్తకం ధర ఇప్పుడు రూ. 75 ఉంటుంది. పేపర్ ధర పెరగడంతో.. ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాల ధర కూడా పెరిగింది” అని పాఠశాల విద్యా శాఖ అధికారి తెలిపారు. 2021లో రూ. 61,000 ఉన్న మెట్రిక్ టన్ను పేపర్.. 2022 నాటికి రూ. 95,000కి పెరగడంతో గత సంవత్సరం, పాఠ్యపుస్తకాల ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. 2021లో పదో తరగతికి సంబంధించిన ఎనిమిది పాఠ్యపుస్తకాల బంచ్ ధర రూ 686గా ఉంది. 2023లో అదే పాఠ్యపుస్తకాల ధర 1,074 రూపాయలకు పెరిగింది. దీన్ని బట్టే రేట్ల పెరుగుదల ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.కాగా 2023-24 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ సంస్థల్లోని 28,77,675 మంది విద్యార్థులకు మొత్తం 1,57,48,270 ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలు అవసరం. మొత్తం 1,05,38,044 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వాటిని మండలాల్లోని పాఠశాలలకు పంపుతారు.