బెంగళూరు ఏప్రిల్ 15: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎంట్రీ ఇస్తోంది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ‘త్రిముఖ పోటీ’ ఉంటుందని అంతా అనుకుంటున్న
తరుణంలో ఎన్‌సీపీ రాకతో ఇప్పుడు బహుముఖ పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. మణిపూర్, మేఘాలయ, గోవాలో ఎన్‌సీపీ ఓటమి చవిచూడటంతో జాతీయ హోదాను ఆ పార్టీ ఇటీవల కోల్పోయింది. ఈ
హోదాని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్‌సీపీని కర్ణాటక ఎన్నికల బరిలో పవార్ దింపనున్నారు. ఎన్‌సీపీ నుంచి 40 నుంచి 45 మంది అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ
యోచనగా ఉంది.నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హోదాను ఈనెల 10న ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. కోల్పోయిన హాదాను పొందాలంటే తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో పోటీ చేసి తగిన
సీట్లు, ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇందుకు మొదటి అడుగుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎన్‌సీపీ దిగుతోంది. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మరాఠా ప్రజలు గణనీయంగా ఉన్నందున
అక్కడి మహారాష్ట్ర ఏకీకరణ్ సమితికి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఎన్‌సీపీ ఉంది.
ద్ పవార్ ఈనెల 13న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలుసుకున్నారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోంచి దింపేందుకు విపక్ష ఐక్యతకు కట్టుబడి ఉన్నట్టు కూడా
ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ భాగస్వామ్య కూటమిగా ఎన్‌సీపీ నిలిచే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో అధికార బీజేపీకి ఎదురీత తప్పకపోవచ్చని, కాంగ్రెస్ ముందంజలో
ఉండవచ్చని, హంగ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంచనాల వెలువడుతున్న తరుణంలో ఎన్‌సీపీ ఉనికి చాటుకుంటే కాంగ్రెస్‌కు కూడా అది ఉపయుక్తంగా ఉండే అవకాశాలున్నాయి. కాగా, మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, 13న ఫలితాలు వెలువడతాయి.