- హెచ్‌ఐసీసీలో 21 ఏండ్ల పండుగ
- పేద, మధ్యతరగతి ఆకాంక్షల ప్రతీకగా 13 తీర్మానాలు
- ప్లీనరీకి 3 వేలమందికి ఆహ్వానం
- ఆహ్వానాలు అందని నేతలు, కార్యకర్తలు బాధపడొద్దు
- ఎవరి పరిధిలో వారు ఆవిర్భావ దినోత్సరం నిర్వహించాలి
- మంత్రి కేటీఆర్ వెల్లడి.. ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన
మాదాపూర్, ఏప్రిల్ 26: పేద, మధ్య తరగతి ప్రజల గుండె చప్పుడు వినిపించే 13 తీర్మానాలను టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టబోతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 60 లక్షల మంది కార్యకర్తలతో జాతీయ పార్టీలకు దీటుగా టీఆర్‌ఎస్ అవతరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టబోతున్న తీర్మానాలతో తెలంగాణ రాష్ట్రం దేశ రాజకీయాలకు దిక్సూచిగా మారుతుందని చెప్పారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చాటే విధంగా తీర్మానాలు ఉండబోతున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ప్రధాన భూమిక పోషిస్తుందని వెల్లడించారు. ఎనిమిదేండ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసిన టీఆర్‌ఎస్, అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతున్నదని చెప్పారు. మత కల్లోలాలతో దేశం అట్టుడుకుతున్న నేపథ్యంలో శాంతిని, సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పవలసిన అవసరంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జాతిని చైతన్యపరిచే కీలకభూమికను టీఆర్‌ఎస్ పోషించే దిశగా సందేశం వెలువడే అవకాశం ఉన్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించాలని ప్లీనరీ ఆయనను కోరే అవకాశం ఉన్నది.
ప్లీనరీ రోజు కార్యక్రమాలు
టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 డివిజన్లు, పట్టణ వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలి.
పార్టీ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి.
గద్వాల, అలంపూర్, కొల్లాపూర్, కొత్తగూడెం, భద్రాచలం, అదిలాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు బుధవారం ఉదయం 5, 6 గంటలకే బయలుదేరి 9:30 గంటలవరకు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
ఉదయం 10 గంటలలోపు ప్రతినిధులంతా వారికి కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాలి.
ప్రతినిధుల రిజిస్ట్రేషన్ కోసం జిల్లాలవారీగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఆయా కౌంటర్లలో వ్యక్తిగత పాసుల్లో ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తారు.
11 గంటలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు.
ఆ వెంటనే కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐజీ చైర్మన్ బాలమల్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులున్నారు.
3 వేల మందికి ఆహ్వానం
ప్లీనరీకి మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్లీనరీకి అహ్వానం అందనివారు బాధ పడవద్దని, ఈసారి ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు పంపామని చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణాల పార్టీ అధ్యక్షులు, జిల్లాల లైబ్రరీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వనించామని వెల్లడించారు.
తెలంగాణభవన్‌లో 40 అడుగుల జెండా
టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో 40 అడుగుల పార్టీ జెండాను ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 9.00 గంటలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జెండాను ఆవిషరిస్తారు. మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా నిర్మాణ పనులను పరిశీలించారు.