అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం: జగన్
అమరావతి: ప్రైవేటు సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున సేకరించి మోసం చేసిన తరువాత డబ్బులు చెల్లించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఇవాళ 7లక్షల మంది డిపాజిట్ దారులకు రూ.666 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని విడుదల చేశారు. రెండో దశ కింద రూ.10వేల నుంచి రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్ దారులకు రూ.666 కోట్లు ఆన్ లైన్ లో జమ చేశారు. మొదటి దశలో 2019లో రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు రూ.238 కోట్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందేనన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దల నిర్వాకం మూలంగా ఖాతాదారులు భారీగా నష్టపోయారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల పైనే కన్నేశారని, ప్రజల డిపాజిట్లను కాపాడాలనే లక్ష్యం లేకుండా పోయిందని జగన్ అన్నారు.