వాషింగ్టన్: అమెరికా భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాబూల్ లో ఐసిస్ ఖొరసాన్ కె గ్రూపు చేసిన దారుణ మారణకాండ పై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ విచారం వ్యక్తం చేశారు.
కాబూల్ ఏయిర్ పోర్టులో జంట పేలుళ్లపై బైడెన్ భావోద్యేగంగా ప్రసంగించారు. ఈ బాంబు దాడిలో 60 మందికి పైగా చనిపోగా, 150 మంది క్షతగాత్రులు అయ్యారు. బాంబు దాడి ఘటనలో 13 మంది అమెరికా సైనికులు చనిపోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైట్ హౌస్ లో మీడియాతో బైడెన్ మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెవరు అయినా క్షమించే ప్రసక్తి లేదు, వాళ్లెవరు అయినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంత తేలికగా మేము మర్చిపోం, ఉగ్రవాదం గెలిచినట్లు కాదన్నారు. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైందని, వెంటపడి వేటాడి ప్రతికారం తీర్చుకుంటామని ఆయన శపథం చేశారు. బాంబు దాడిలో మృతిచెందిన వారికి సంఘీభావంగా బైడెన్ కొద్దిసేపు మౌనం పాటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 31వ తేదీలోపు ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైనిక బలగాలు, పౌరుల తరలింపును పూర్తి చేస్తామని బైడెన్ అన్నారు.