సంక్షోభం తలెత్తినా సంక్షేమం ఆపలే..
- మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం..
- కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండుసున్నా..
- పేదల పక్షపాతి టీఆర్‌ఎస్ ప్రభుత్వం..
- కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణ అభివృద్దిలో నెంబర్ వన్..
మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, ఫిబ్రవరి 2 : యావత్ ప్రపంచం కొరోనా కారణంగా ఆర్ధికంగా అతలాకుతలమై సంక్షోభం తలెత్తినా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ఆపలేదని మున్సిపల్ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో బుధవారం సుమారు రూ. 256 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ది పనుల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఊహలకు అందని విదంగా, ప్రణాళికబద్దంగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో దేశానికి దిక్సూచిలా ముందుకు దూసుకుపోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. కానీ ప్రత్యేక తెలంగాణలో కరెంట్ పోతే వార్తగా మారిందన్నారు. నిరంతర కరెంట్ సరఫరాతో పాటు ఇంటింటికి నీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కొరోనా మహమ్మారితో రెండేళ్లుగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా వేలాది కోట్ల రూపాయలతో కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆపకుండా ఎన్ని అవంతరాలు ఎదురైనా, చాకచక్యంగా ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూ సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలతో గతంలో ఇచ్చిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విద్యుద్దర్మం నెరవేర్చాలనే సదుద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా కేవలం రెండు కార్పొరేషన్లకు రూ. 110 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్‌ల నిర్మాణం చేపడున్నామన్నారు. గతంలోని ప్రభుత్వాలు మున్సిపాలిటీ రూ. ఒకటి, రెండు కోట్లు నిధులు విడుదల చేస్తేనే గొప్పలు పోయేవారని, కానీ తమ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులు మంజూరీ చేస్తూ మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
కేంద్ర బడ్జెట్ హల్లిహల్లి సున్నకు సున్న..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ హల్లికి హల్లి- సున్నకు సున్న అన్నట్లుగా ఉందని కేటీఆర్ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్నింటిలోనూ మొండి చూపారని ప్రధాని మోడీని దుయ్యబట్టారు. ఎన్ని అడిగినా ఎంత మొత్తుకున్నా ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని వాపోయారు. వైద్య విద్య సంస్థలు అడిగాం అయినా మొండి చేయి చూపారు. ఐఐఎంలు, నవోదయ పాఠశాలలు, ఐఐఐటీలు వంటివి ఏవీ ఇవ్వకుండా అన్నింటిలోనూ గుండుసున్నా చూపించారని, విద్యా సంస్థలు ఇయ్యరు, నిధులియ్యరు ఏ రకంగా సహకరించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అంశాల్లో కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరినా ఏ ఒక్కదాంట్లోనూ న్యాయం చేయలేదని మండిపడ్డారు. హిందూ, ముస్లీం పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ..
దేశానికి సంపద సృష్టించి పెట్టడంలో నాల్గవ స్థానంలో ఉన్న తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ తీవ్ర వివక్ష చూపుతోందని మంత్రి ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా తెలంగాణ రైతులకు రైతు బందు, సంక్షేమంలో, అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం. తెలంగాణకు అన్నింటిలోనూ మొండి చూపుతున్న నరేంద్ర మోడీ కేవలం గుజరాత్‌కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరదలతో హైదరాబాద్ చితికిపోతోందని సాయం చేయండని అభ్యర్ధిస్తే పైసా విదల్చలేదని విమర్శించారు. తెలంగాణ పరాయి దేశమైనట్లు, దేశంలో అంతర్భాగం కాదన్నట్లు, ఈ రాష్ట్రానికి ఇంకెవరో ప్రధానమంత్రి ఉన్నట్లు మోడీ శీతకన్ను వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణకు మోడీ ప్రాదాని కాడా..? ఒక్క గుజరాత్‌కే మోడీ ప్రధానా..? అంటూ ప్రశ్నించారు.
సాయిప్రియ భాదితులకు న్యాయం చేస్తాం..
పర్వతాపూర్ సాలార్‌జంగ్ కంచ సాయిప్రియనగర్‌లో ప్లాట్లు కొని మోసపోయిన భాదితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి కేటీరామారావు అన్నారు. డెవలపర్ చేసిన మోసంతో సీలింగ్‌లో పొజీషన్ చూయించాడు. 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని, మేలు చేసే ప్రభుత్వం తప్ప కానీ కీడు చేసే ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. మానవీయ కోణంలో భాదితులకు న్యాయం చేస్తామన్నారు. సాయిప్రియలో వేసిన పెన్సింగ్ తొలగించాలని మంత్రి ఆదేశించారు. అదే విదంగా మేడిపల్లి సర్వే 62 దళితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఉప్పల్ బగాయత్ మాదిరిగా లేఅవుట్ అభివృద్ది చేసి ప్లాట్లు ఇచ్చే భాద్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సదరు భూమిని అభివృద్ది చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని మంత్రి కేటీఆర్ అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
ం వైకుంఠదామం ఆదర్శం..
మేడిపల్లి వైకుంఠధామం ఆదర్శమని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఒకే స్మశానవాటికలో హిందువులు, ముస్లీం, క్రిస్టియన్ల మృత దేహాలకు ఖననం, దహన సంస్కారాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు కల్పించడం మత వైశమ్యాలు లేని సంస్కారవంతమై వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. వైకుంఠధామం తీర్చిదిద్దడంలో మేయర్ వెంకట్ రెడ్డి కృషికి కేటీఆర్ ఖితాబునిచ్చారు. వైశామ్యాలు లేని వాతావరణం మనం కోరుకుంటుంటే ఓ వర్గం మాత్రం మతాల మద్య చిచ్చు పెట్టి లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందని చురకలంటించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ల ప్రోత్సాహంతో రాష్ట్రం అబివృద్ది పథంలో పయనిస్తోందని, ఈ కారణంగానే పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా శరవేగంగా అభివృద్ది సాధిస్తున్నాయన్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లు అభివృద్దిలో నంబర్ వన్ పొజీషన్‌లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు కె. జనార్ధన్ రెడ్డి, నవీన్‌రావు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి, జంట కార్పొరేషన్ల మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, సామల బుచ్చి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జంట కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త లక్ష్మి రవి గౌడ్, పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జంట కార్పొరేషన్ల టీఆర్‌ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, మంద సంజీవ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చామకూర బద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.