మోడీ ఇప్పటికైనా న్యాయం చేస్తారా
విజయవాడ, ఫిబ్రవరి 9: ఆంధప్రదేశ్ కు అన్యాయం జరిగిందని మీరు చెప్పిన మాట వాస్తవమే. హడావిడిగా చేసిన వల్ల ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నష్టపోయాయి. అయితే పాపం మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆరోజు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా మోదీ ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పర్చడానికి కాంగ్రెస్ ను వాడుకున్నారు.కాంగ్రెస్ చేసింది తప్పే. విభజన జరిగి ఏడేళ్లు దాటుతుంది. 2014 ఎన్నికలకు ముందు తల్లీ, బిడ్డను వేరు చేసిందని వాపోయిన మోదీ అధికారంలోకి రాగానే రెండు రాష్ట్రాలకు చేసిందేమీ లేదు. పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో ఏపీ, తెలంగాణను పట్టించుకోలేదు.
ఏడేళ్ల నుంచి నిధుల కేటాయింపులో ఏపీకి, తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించింది లేదు. ఇక విభజన హామీలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు.ఏపీకి ప్రత్యేక హోదా అవసరం. విభజన జరిగిన తర్వాత పూర్తిగా నష్టపోయిన రాష్ట్రం ఏపీ మాత్రమే. రాజధానిని కోల్పోయి పారిశ్రామికంగా వెనకబడి ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉండగా ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు. నీతి ఆయోగ్ పేరిట హోదా ఇక కష్టసాధ్యమని తేల్చేశారు. దక్షిణాది రాష్ట్రం కావడంతోనే ఈ వివక్ష పాటించారని ఎవరికైనా అర్థమవుతుంది. రెండోసారి పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో మోదీని ఏమీ చేయలేక, అనలేక ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు మౌనంగా ఉంటున్నారు.కాంగ్రెస్ చేసింది తప్పే.
దాని ఫలితాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ అనుభవిస్తుంది. నాడు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన ఏపీ కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది. మరో రెండు దశాబ్దాలు కాంగ్రెస్ ఏపీలో కనపడే అవకాశాలు లేవు. చచ్చి పోయిన కాంగ్రెస్ ను చంపి ఇంకా ఏంసాధిస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అలాగే బీజేపీ కూడా. ఏడేళ్ల నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని ప్రయవేటీకరించడంపై ఏపీ ప్రజల కడుపు మండిపోతుంది. కాంగ్రెస్ పై నెపం నెట్టేముందు తాము ఏం చేశామో మోదీ గుర్తు చేసుకోవడం మంచిది. కాంగ్రెస్ విభజన చేసి ఎంత పాపం చేసిందో? అదే పాపాన్ని బీజేపీ కూడా మూటగట్టు కుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.