National News Networks

తెలంగాణ ప్రగతిశీలం

Post top
  • అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత అద్భుతం: అజీం ప్రేమ్‌జీ
  • మహేశ్వరంలో రూ.300 కోట్లతో కన్జ్యూమర్‌ కేర్‌ ఫ్యాక్టరీ
  • రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం
  • కేటీఆర్‌ మంచి వక్త.. చార్మింగ్‌ పర్సన్‌
  • విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ ప్రశంసలు
  • జీనోమ్‌ వ్యాలీలో కెనడా సంస్థ
  • రూ.250 కోట్లతో జాంప్‌ ఫార్మా యూనిట్‌
  • పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
  • గుజరాత్‌ వ్యాపారవేత్తలకూ అహ్మదాబాద్‌ కన్నా హైదరాబాదే ఇష్టం: మంత్రి కేటీఆర్‌

పారిశ్రామికరంగంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్నదని విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ అన్నారు. తమ వ్యాపారాలకు ఎంతో సహకారం అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటెనింగ్‌ కంపెనీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అజీమ్‌ ప్రేమ్‌జీతో కలిసి ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌పై ప్రేమ్‌జీ ప్రశంసల వర్షం కురిపించారు.

ముందుముందు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టి స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. లాభాపేక్షతో కాకుండా వినియోగదారుల క్షేమాన్ని కోరేలా పరిశ్రమను తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నదో, ఇక్కడి ప్రజలు కూడా అంతే సహాయకారులుగా ఉన్నారని కొనియాడారు. కరోనా మహమ్మారి నియంత్రణలో దేశంలో తెలంగాణలాగా మరే రాష్ట్రమూ కృషి చేయలేకపోయిందని అభినందించారు. మంత్రి కేటీఆర్‌ మంచి వక్త అని ప్రశంసించారు. ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉన్న కేటీఆర్‌ ప్రసంగాన్ని అనుసరించటం కష్టమని పేర్కొన్నారు.

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత ఏడేండ్లలో రాష్ర్టానికి రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 16 లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. కేసీ తండాలో రూ.300 కోట్లతో స్థాపించిన విప్రో కన్జ్యూమర్స్‌ పరిశ్రమలో 900 మందికి ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. ఇందులో స్థానికులకే 90 శాతం ఉద్యోగాలు లభించాయని, వారిలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఏర్పాటుచేస్తున్న కంపెనీలకు స్థానికులు సహకారం అందించాలని కోరారు. అజీమ్‌ ప్రేమ్‌జీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా గొప్ప సామాజ సేవకుడని పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో తెలంగాణకు రూ.25 కోట్ల హెల్త్‌ రిలీఫ్‌ ఫండ్‌తోపాటు రూ.44 కోట్లు స్వచ్ఛంద సేవా సంస్థలకు నేరుగా అందించి గొప్ప మనసు చాటుకొన్నారని కొనియాడారు. తెలంగాణలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటుచేయాలని అజీమ్‌ ప్రేమ్‌జీని కోరారు. విప్రో కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, విప్రో సీఈవో వినీత్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.